Telugu Global
National

మోదీజీ.. షేమ్ ఆన్ యు.. కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేసిన ఘనత సిసోడియాకు దక్కుతుందని, అదంతా కేవలం ఐదేళ్లలోనే ఆయన చేశారని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. అందుకు బహుమానంగా ఆయనను జైలులో పెట్టారని విమర్శించారు.

మోదీజీ.. షేమ్ ఆన్ యు.. కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
X

ప్రతిపక్ష నేతలతో కలసి మోదీకి ఘాటు లేఖ రాసిన అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. చత్తీస్ గడ్ ర్యాలీలో మరోసారి ప్రధానిపై నిప్పులు చెరిగారు. మోదీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైలులో పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేసిన ఘనత సిసోడియాకు దక్కుతుందని, అదంతా కేవలం ఐదేళ్లలోనే ఆయన చేశారని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. అందుకు బహుమానంగా ఆయనను జైలులో పెట్టారని విమర్శించారు. సాధువు, మహాత్ముని లాంటి సిసోడియాను జైలుకు పంపారు, దీనికి మోదీ సిగ్గు పడాలి అని వ్యాఖ్యానించారు.

మీ తప్పులు కనపడవా..?

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్‌ వసూలు చేస్తోందన్న ఆరోపణలు మోదీకి వినిపించడంలేదా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. నేరుగా బీజేపీ ఎమ్మెల్యేలే కమీషన్లు వసూలు చేస్తున్నారని, వారి దెబ్బకు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. సాధువు లాంటి సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించారని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు. సిసోడియా సీబీఐ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగించడాన్ని కేజ్రీవాల్ పరోక్షంగా ప్రస్తావించారు. సిసోడియాను మానసికంగా టార్చర్ చేస్తున్నారని అన్నారు.

స్వతంత్రంగా పనిచేయాల్సిన ఈడీ, సీబీఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నాయని, గత ఎనిమిదేళ్లలో 3వేల దాడులు నిర్వహించాయని చెప్పారు కేజ్రీవాల్. అందులో 95 శాతం దాడులు విపక్ష నేతలని టార్గెట్ చేసుకుని జరిగినవేనని చెప్పారు. ఛత్తీస్‌ గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలపాలన్నారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ తోపాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మన్‌ కూడా అక్కడ పర్యటన చేపట్టారు.

First Published:  6 March 2023 6:09 AM IST
Next Story