Telugu Global
National

పరారీలో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ

విచారణ నిమిత్తం శనివారం పోలీసులు హోళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కన్పించలేదు. దీంతో ఆమె పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

పరారీలో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ
X

మహిళలపై లైంగిక దౌర్జన్యం, బ్లాక్‌ మెయిల్‌ ఆరోపణలతో హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసులో అతని తల్లి భవానీ రేవణ్ణ పైనా విచారణకు సిద్ధమవగా, ఆమె పరారీలో ఉన్నట్టు తెలిసింది. రేవణ్ణ ఇంటి పనిమనిషి కిడ్నాప్‌ ఘటనలో భర్త రేవణ్ణతో పాటు భవానీకి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమెను విచారించేందుకు సిట్‌ అధికారులు ఆమెకు నోటీసులు పంపించారు. ఆమెను వారి ఇంటి వద్దే విచారణ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

విచారణ నిమిత్తం శనివారం పోలీసులు హోళెనరసీపురలోని ఆమె నివాసానికి వెళ్లగా భవానీ అక్కడ కన్పించలేదు. దీంతో ఆమె పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. శనివారం ఆమెను విచారణ చేసిన అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేసే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

కర్ణాటక రాష్ట్రంలోని హాసనలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన మరుసటిరోజే ఈ అశ్లీల వీడియోల వ్యవహారం బయటికొచ్చింది. అప్పటికే ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన తండ్రి రేవణ్ణపైనా ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ప్రజ్వల్‌ లొంగిపోవాలని ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ సహా కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు చేరిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 6 వరకు సిట్‌ కస్టడీకి అప్పగించారు.

First Published:  1 Jun 2024 5:57 PM IST
Next Story