గువాహటిలో ఘోరం.. - కారు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం
సోమవారం తెల్లవారుజామున జలూక్ బరీ ప్రాంతంలో అతి వేగంతో వెళ్తున్న వీరి కారు అదుపు తప్పింది. దీంతో కారు డివైడర్‌ను దాటుకుని అవతలికి వెళ్లి.. ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.
అస్సోం రాష్ట్రంలోని గువాహటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. గువాహటిలోని జలూక్ బరీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అస్సోం ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు వెళ్తున్న కారు అదుపుతప్ప వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్‌లో ఉన్న మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గువాహటిలోని అస్సోం ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాలేజీ ప్రాంగణం నుంచి కారులో బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున జలూక్ బరీ ప్రాంతంలో అతి వేగంతో వెళ్తున్న వీరి కారు అదుపు తప్పింది. దీంతో కారు డివైడర్‌ను దాటుకుని అవతలికి వెళ్లి.. ఎదురుగా వస్తున్న పికప్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పికప్ వ్యాన్‌లో ఉన్న మరో ముగ్గురు కూడా గాయపడ్డారు.
క్షతగాత్రులను గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు కారును అద్దెకు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.