'రియల్ శివసేన' కేసులో సుప్రీంకోర్టులో థాకరే టీమ్‌కు ఎదురుదెబ్బ
సుప్రీం కోర్టులో ఉద్దవ్ ఠాక్రేకు ఎదురు దెబ్బ తగిలింది. అసలైన శివసేన , పార్టీ గుర్తు తదితర అంశాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకుండా ఆపడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
శివవసేన పేరు, గుర్తు తమకే చెందాలంటూ ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే ల మధ్య జరుగుతున్న న్యాయ పోరాటంలో ఉద్ధవ్ బృందానికి నేడు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తమదే అసలైన శివసేన అని, పార్టీ గుర్తు కూడా తమకే చెందాలంటూ ఏక్‌నాథ్ షిండే ఎన్నికల కమిషన్ లో పిటిషన్ వేశారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ను నిలవరించాలని కోరుతూ ఉద్ధవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అసలు శివసేనను ఎవరు ఏర్పాటు చేసారో నిర్ణయించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
తన తండ్రి బాల్ థాకరే స్థాపించిన శివసేనలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు జరిగి పార్టీలో చీలిక వచ్చింది. తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ఎంవిఎ ప్రభుత్వం జూన్‌లో కుప్పకూలింది. షిండే బిజెపితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన డిప్యూటీగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.
షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ థాకరే బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే, షిండే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండేది. అనర్హత ప్రశ్న పరిష్కారమయ్యే వరకు 'నిజమైన శివసేన'పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని థాకరే సుప్రీంకోర్టును కోరారు.
శివసేనకు ఉన్న 55 మంది ఎమ్మెల్యేలలో, షిండేకు 40 మంది, 18 మంది ఎంపీలలో 12 మంది మద్దతు ఉందని చెబుతుతున్నారు. ఇటువంటి వివాదాలలో ఆయా వర్గాలకు మద్దతుగా ఉన్న ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఫీస్ బేరర్ల సంఖ్య ను బట్టి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది.
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున, వారు అనర్హులుగా మారినట్లయితే, చిహ్న వివాద విచారణలో వారిని లెక్కించలేమని థాకరే శిబిరం వాదించింది, అయితే రెండూ రెండు వేర్వేరు విచారణలు అని సుప్రీం కోర్టు పేర్కొంది.
ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లు ఫిరాయింపులు, విలీనం, అనర్హత వంటి అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తడంతో వాటి విచారణను ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కు ఆగస్టు లో బదిలీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, స్పీకర్, గవర్నర్‌ల అధికారం, న్యాయ సమీక్ష వంటి ముఖ్యమైన రాజ్యాంగపరమైన అంశాలను ఈ పిటిషన్లు లేవనెత్తుతున్నాయని కోర్టు పేర్కొంది.