Telugu Global
National

ఛత్రపతి శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు... షిండే వర్గంలో ముసలం

మహారాష్ట్రలో అధికార పార్టీ, శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ పై ధ్వజమెత్తారు. ఆయనను తక్షణం రాష్ట్రం నుంచి పంపించివేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీపై అవమానకర ప్రకటనలు చేశారని మండిపడ్డారు.

ఛత్రపతి శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు... షిండే వర్గంలో ముసలం
X

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారంరేపాయి. ఇప్పటికే శివసేన ఉద్దవ్ వర్గం గవర్నర్ పై తీవ్రంగా మండిపడగా ఇప్పుడు షిండే వర్గంలోని ఓ ఎమ్మెల్యే గవర్నర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు గవర్నర్ చేసిన వ్యాఖ్యలేంటి ?

తాజాగా ఔరంగాబాద్‌లో బీజేపీ సీనియర్‌ నేత నితిన్ గడ్కరీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌లకు డి.లిట్‌ పట్టాలను ప్రదానం చేసిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మాట్లాడుతూ... ''ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత రోజులకు చిహ్నం. ఇప్పుడు ఆయన అవసరం లేదు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల వంటి ఎందరో అందుబాటులో ఉన్నారు'' అని వ్యాఖ్యానించారు.

దీనిపై శివసేన ఉద్దవ్ వర్గం, ఎన్సీపీలు తీవ్రంగా స్పందించాయి. గవర్నర్ ను తక్షణమే తొలగించాలని ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. గవర్నర్ ఇప్పటి వరకు నాలుగు సార్లు శివాజీమహారాజ్ ను అవమానిస్తూ మాట్లాడినా ముఖ్యంత్రి షిండే మౌనంగా ఉండటం లో అర్దం ఏంటి ? ఆయనసలు మహారాష్ట్ర బిడ్డేనా ? అని ప్రశించారు రౌత్

ఇక ఈ రోజు ఏకంగా అధికార పార్టీ నేత, షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా గవర్నర్ పై ధ్వజమెత్తారు. ఆయనను తక్షణం రాష్ట్రం నుంచి పంపించివేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కోష్యారీ గతంలో కూడా మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీపై అవమానకర ప్రకటనలు చేశారని మండిపడ్డారు.

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఆశయాలకు ఎప్పటికీ చావు లేదని, ప్రపంచంలోని మరే ఇతర గొప్ప వ్యక్తితోనూ ఆయనను పోల్చలేమ‌ని, రాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి శివాజీపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కే‍ంద్రంలోనీ బీజేపీ సీనియర్ నేతలకు కూడా మహారాష్ట్ర చరిత్ర తెలిసినట్టు లేదని ఆయన విమర్శించారు.

కాగా బీజేపీ సహాయంతో శివసేనను చీల్చి , ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం షిండే వర్గంలో , బీజేపీలో కలకలం రేపుతున్నాయి.

First Published:  21 Nov 2022 7:32 PM IST
Next Story