Telugu Global
National

మోదీ కటౌట్ తో సెల్ఫీ.. ఇదేనా ప్రజలకు కావాల్సింది..?

ఇటీవల పలు రైల్వే స్టేషన్లలో మోదీ ఫొటోతో ఉన్న సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రజల డబ్బుతో ఇలా సెల్ఫీ పాయింట్లను పెట్టడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

మోదీ కటౌట్ తో సెల్ఫీ.. ఇదేనా ప్రజలకు కావాల్సింది..?
X

భారత ప్రజలకు ఏం కావాలి..? కేంద్రం ఏం ఇవ్వాలనుకుంటోంది..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రాహుల్ గాంధీ. రైల్వే స్టేషన్లలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? చౌక రైలు ప్రయాణమా, లేక షెహన్ షా తో సెల్ఫీనా..?" అంటూ ఘాటు ట్వీట్ వేశారు.


ఇటీవల పలు రైల్వే స్టేషన్లలో మోదీ ఫొటోతో ఉన్న సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను సూచిస్తూ వీటిని రూపొందించారు. ఇక్కడ అధికారికంగా ఎవరైనా ఆగి సెల్ఫీ తీసుకోవచ్చు. అయితే ప్రజల డబ్బుతో ఇలా సెల్ఫీ పాయింట్లను పెట్టడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మోదీ కటౌట్ లు పెట్టడానికి కూడా ప్రజల సొమ్ము దుబారా చేయాలా అని కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ.

పేదవాడి చౌక రవాణా అయిన రైల్వే ఇటీవల కాస్ట్ లీ గా మారింది. రైలు టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. వృద్ధులకు టికెట్లపై ఇచ్చే రాయితీ తీసివేశారు. ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలు కూడా పెరిగాయి. ప్యాసింజర్ రైళ్లు తగ్గి, ఎక్స్ ప్రెస్ లు పెరిగాయి. దానికి అనుగుణంగా రేట్లు కూడా పెంచేశారు. వీటన్నిటితో ప్రైవేటీకరణకు అనువైన పరిస్థితులు కల్పించారని కేంద్రంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. ప్రజల కష్టార్జితాన్ని సెల్ఫీ స్టాండ్‌ ల కోసం వెచ్చిస్తారా..? అని ప్రశ్నించారు.

First Published:  30 Dec 2023 7:01 PM IST
Next Story