Telugu Global
National

రాహుల్‌కు పిల్లను చూడండి.. హర్యానా మహిళలతో సోనియా గాంధీ

ఇటీవల రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు. అక్కడ సోనేపట్ జిల్లాలోని మదీనా గ్రామంలో కొంత మంది మహిళలను కలిశారు.

రాహుల్‌కు పిల్లను చూడండి.. హర్యానా మహిళలతో సోనియా గాంధీ
X

దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. సినిమాల్లో సల్మాన్ ఖాన్, పాలిటిక్స్‌లో రాహుల్ గాంధీ పేర్లు చెబుతారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘంగా చేసిన భారత్ జోడో యాత్రతో ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. జోడో యాత్ర తర్వాత కూడా రాహుల్ ప్రజలతో మమేకం అవడాన్ని ఆపలేదు. అప్పుడప్పుడు లారీల్లో ప్రయాణిస్తూ, మెకానిక్‌ల దగ్గరకు వెళ్తూ వారి సాదకబాధకాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు. అక్కడ సోనేపట్ జిల్లాలోని మదీనా గ్రామంలో కొంత మంది మహిళలను కలిశారు.

పొలాల్లో పని చేసుకుంటున్న మహిళల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాము ఢిల్లీ వచ్చి రాహుల్ ఇంటిని చూడాలని అనుకుంటున్నట్లు సదరు మహిళలు తమ మనసులో మాట వెల్లడించారు. అయితే, తన ఇంటిని మోడీ ప్రభుత్వం తీసేసుకుందని బదులిచ్చారు. అక్కడి నుంచే చెల్లి ప్రియాంకకు కాల్ చేసి.. ఇక్కడి మహిళలు ఢిల్లీ చూడాలని అనుకుంటున్నారని.. అలాగే మన ఇంటికి వస్తారంటా అంటూ చెప్పారు. దీంతో ఆమె సాదరంగా తన తల్లి సోనియా గాంధీ ఇంటికి ఆహ్వానించారు.

హర్యానా నుంచి ఢిల్లీ వచ్చిన పలువురు మహిళలు, యువతులు, పిల్లలు ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ రాహుల్, ప్రియాంక, సోనియా సాదరంగా వారిని ఆహ్వానించారు. మహిళలు తమ వెంట తీసుకొని వచ్చిన లస్సీ, ఇతర వంటకాలను వారికి అందజేసి.. చాలా సేపు ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఉండాలో రాహుల్ వివరించారు.

ఒక మహిళ సోనియా గాంధీతో.. రాహుల్‌కు పెళ్లి చేయరా అని ప్రశ్నించింది. దానికి బదులిస్తూ.. మీరే ఒక మంచి అమ్మాయిని చూడండి అని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అంతే కాకుండా రాహుల్ కూడా నవ్వుతూ.. అవుతుంది.. అవుతుంది అంటూ నవ్వులు పూయించారు. మహిళలతో ప్రధాని రాజీవ్ గాంధీ మరణం గురించి కూడా సోనియా వివరించారు. ఆ సంఘటన తాలూకు ఘటనలను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు.


First Published:  29 July 2023 2:55 PM IST
Next Story