Telugu Global
National

హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకే 'వై కేటగిరీ' భద్రత.. కారణం ఏంటో తెలుసా?

హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో 12 మంది ఉన్నతాధికారులకు ఢిల్లీ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకే వై కేటగిరీ భద్రత.. కారణం ఏంటో తెలుసా?
X

సాధారణంగా పోలీసులే అందరికీ రక్షణ కల్పిస్తుంటారు. రాజకీయ ప్రముఖులు, సెలెబ్రిటీల ప్రాణాలకు ముప్పు ఉంటే.. ఎక్స్, వై, జెడ్ కేటగిరీ భద్రతను అందిస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. పోలీసులకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీని వెనుక పెద్ద కథే ఉన్నది. పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలను గ్యాంగ్‌స్టర్ గోల్డ్‌బ్రార్ కొన్నాళ్ల క్రితం హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో 12 మంది ఉన్నతాధికారులకు ఢిల్లీ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బెదిరింపుల తీవ్రత, హోదాను బట్టి కొందరికి వై కేటగిరీ, మరి కొందరికి ఎక్స్ కేటగిరీ భద్రతను అందిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న పోలీసులకు 24 గంటల పాటు భద్రత కల్పించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. కెనడాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్‌సింగ్ లండా నుంచి ఇటీవల పోలీసులకు బెదిరింపులు రావడంతో ఈ మేరకు భద్రతను ఏర్పాటు చేశారు.

సుఖ్‌దీప్‌సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలాను ఈ ఏడాది మే29న మాన్సా జిల్లాలో కొందరు షూటర్లు దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందుకు కారకులైన పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తునకు సంబంధించిన చార్జీ షీటును కూడా దాఖలు చేశారు. మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో సభ్యుడైన గోల్డ్‌బ్రార్ ప్రధాన సూత్రదారిగా పోలీసులు తేల్చారు. సిద్ధూకు భద్రతను తీసేసిన విషయాన్ని అతనే సమాచారం అందించి చంపాలని ఆదేశించినట్లు చార్జి షీటులో పేర్కొన్నారు.

నవంబర్ నెలలో ఢిల్లీ-పంజాబ్ పోలీసులు జలంధర్‌లో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ సెర్చ్ ఆపరేషన్‌లో లండా గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. అప్పుడే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ అధికారులను బెదిరిస్తూ లండా ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. పంజాబ్‌కు చెందిన లండా 2017 నుంచి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్న అధికారుల ఫొటోలు, వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని, తేడా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే వారికి భద్రత పెంచుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

పోలీస్ కమిషనర్ (ప్రత్యేక విభాగం) హెచ్‌జీఎస్ ఢాలీవాల్, డీసీపీ రాజీవ్ రంజన్, డీసీపీ (ప్రత్యేక విభాగం) చంద్ర లకు వై కేటగిరీ భద్రత కల్పించగా.. మరో నలుగురు ఏసీపీ, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లకు నిరంతరం సాయుధ పోలీస్ కమాండో భద్రత ఉండేలా ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోడా ఆదేశాలు జారీ చేశారు.

First Published:  15 Dec 2022 7:07 AM IST
Next Story