Telugu Global
National

బడి పిల్లల నోటి దగ్గర గుడ్డు లాగేస్తున్నారు..

మొదట బీఫ్ తినొద్దు అన్నారు.. కొద్దిమందికే కదా అనుకున్నారు మిగతా వాళ్లు. తర్వాత చికెన్, మటన్ కూడా నిషిద్ధం అన్నారు.

Schoolchildren should not be provided eggs in mid-day meals: Tejaswini, sparks row
X

మొదట బీఫ్ తినొద్దు అన్నారు.. కొద్దిమందికే కదా అనుకున్నారు మిగతా వాళ్లు. తర్వాత చికెన్, మటన్ కూడా నిషిద్ధం అన్నారు. ఇదెక్కడి విడ్డూరం అనుకున్నారంతా. ఇప్పుడు బడిపిల్లల నోటి దగ్గర గుడ్డు లాగేస్తున్నారు. వెజిటేరియన్ ఫుడ్ అనే పేరుతో పిల్లలకు గుడ్డు పెట్టొద్దంటూ కర్నాటకలో వింత వాదన తెరపైకి తెచ్చారు. ఇలాగే వదిలేస్తే రేపు ప్రజల వంటిళ్లలోకి వచ్చి ఏమేం తినాలో మేమే డిసైడ్ చేస్తామని చెప్పే రోజు కూడా రావొచ్చు. అవును, ఇది నిజం.. బీఫ్ తో మొదలు పెట్టి గుడ్డు వరకు వచ్చినవాళ్లు.. రేపు కందమూలాలు తినండి, మిగతావాటిపై ట్యాక్స్ వేస్తామంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

కర్నాటకలో గుడ్డు వివాదం..

కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అనంత్ కుమార్ భార్య తేజస్విని చేసిన ట్వీట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. స్కూల్ పిల్లలకు గుడ్డు పెట్టడం సరికాదని అంటున్నారామె. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కేవలం శాకాహారమే అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నాటకలో బడి పిల్లలకు భోజనం తయారు చేసే ఆదమ్య చేతన అనే సంస్థను నిర్వహిస్తున్న తేజస్విని.. ఈ కొత్త లాజిక్ ని తెరపైకి తెచ్చారు. కోడి గుడ్డు మాంసాహారం అంటున్న ఆమె.. గుడ్డుని నిషేధించాలంటూ కర్నాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



అంగన్వాడీ పిల్లలకు కోడిగుడ్లను పంపిణీ చేసే విధానం కర్నాటకలో చాలా కాలం నుంచే ఉంది. ఇటీవల దీన్ని పొడిగించడంతోనే అసలు సమస్య మొదలైంది. కర్నాటకలో 8 జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. 1నుంచి 8వ తరగతి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఉడికించిన గుడ్లను అందిస్తున్నారు. ఇటీవల జరిపిన కుటుంబ ఆరోగ్య సర్వేలో కర్నాటకలోని 32.9 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ సహకారంతో నడిచే స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను పంపిణీ చేయడం మొదలు పెట్టింది కర్నాటక ప్రభుత్వం. మఠాలు నిర్వహించే స్కూళ్లు మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తేజస్విని మాత్రం అన్ని స్కూళ్లలో గుడ్డు నిషేధించాలంటున్నారు. విద్యార్థులంతా సమానమేనని, కొంతమందికి గుడ్డు ఇచ్చి, కొంతమందికి ఇవ్వకపోవడం సబబు కాదని అంటున్నారు. అందరికీ గుడ్డు మానేయాలని చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే పౌష్టికాహార పంపిణీలో భాగంగా గుడ్డు ఇవ్వాలనుకంటే రేషన్ సరకుల లాగా ఇంటికి పంపించాలని సలహా ఇచ్చారు. గుడ్డు తినని వారికి ఇతర ఆహారం, పండ్లు లేదా చిక్కీ ఇంటికే పంపించాలన్నారు.

తేజస్విని ట్వీట్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. పౌష్టికాహారం పిల్లల హక్కు అని, దాన్ని అడ్డుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. పోషకాహార నిపుణులు, పరిశోధకులు, వైద్యులు, కర్నాటక పౌరులు.. కొంతమంది గుడ్డుని కొనసాగించాలని.. 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా గుడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఈ గుడ్డు వివాదం ఇప్పుడు కర్నాటకతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇది కేవలం గుడ్డుతో పోదని, ఇలాగే వదిలేస్తే.. దేశ ప్రజల ఆహారపు అలవాట్లను కూడా ప్రభుత్వాలు మార్చాలనుకుంటాయని మండిపడుతున్నారు.

First Published:  3 Aug 2022 1:10 PM IST
Next Story