Telugu Global
National

10th సిలబస్‌ నుండి డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ 1800 మంది శాస్త్రవేత్తల బహిరంగ లేఖ!

జీవపరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి అత్యంత కీలకమని, ఇది హేతుబద్ధమైన ప్రపంచ దృష్టి కోణాన్ని అధ్యయనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని లేఖపై సంతకం చేసిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పరిణామ క్రమంలో సమాజాలకు, దేశాలకు ఎదురయ్యే సవాళ్లను మనం ఎలా ఎదుర్కోవాలనేది తెలుసుకోవడానికి జీవపరిణామ సిద్ధాంతం అత్యవసరమని వారు పేర్కొన్నారు.

10th సిలబస్‌ నుండి డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ  1800 మంది శాస్త్రవేత్తల బహిరంగ లేఖ!
X

పదవతరగతి పాఠ్యాంశాల్లోంచి డార్విన్‌ సిద్ధాంతాన్ని తొలగించాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అత్యంత ముఖ్యమైన జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం ప్రజలను మూఢ‌త్వంలోకి నెట్టడంలో భాగంగా చేసే కుట్ర అనే విమర్శలు వస్తున్నాయి.

పదవ తరగతి సిలబస్‌ నుండి జీవపరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలనే కేంద్ర ఉన్నత పాఠశాల పాఠ్య ప్రణాళిక బోర్డు నిర్ణయం ప్రమాదకరమైన పరిణామం అని దేశవ్యాప్తంగా 1800 మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఒక‌ ప్రకటన విడుదల చేశారు.

జీవపరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి అత్యంత కీలకమని, ఇది హేతుబద్ధమైన ప్రపంచ దృష్టి కోణాన్ని అధ్యయనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని లేఖపై సంతకం చేసిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పరిణామ క్రమంలో సమాజాలకు, దేశాలకు ఎదురయ్యే సవాళ్లను మనం ఎలా ఎదుర్కోవాలనేది తెలుసుకోవడానికి జీవపరిణామ సిద్ధాంతం అత్యవసరమని వారు పేర్కొన్నారు. మానవుల గురించి అవగాహనను విస్తృతం చేయడంలో ఇది తోడ్పడుతుందని వారు చెప్పారు.

జీవపరిణామ సిద్దాంతం పిల్లలకు బోధించకపోతే వారి జ్ఞానంలో నిండుతనముండదని వారు పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన 1800 మందిలో కోలకత్తాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ నుండి భౌతిక శాస్త్రవేత్త సౌమిత్రో బెనర్జీ, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నుండి జీవశాస్త్రవేత్త రాఘవేంద్ర గడగ్కర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ బెంగళూరుకి చెందిన జీవశాస్త్రవేత్త ఎల్‌.ఎస్‌. శశిధర్‌ తదితరులు ఉన్నారు.

ఇటీవల 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పన్నెండవ తరగతి చరిత్ర పాఠ్యాంశాలలో మొఘలులు, మహాత్మాగాంధీకి సంబంధించిన అంశాలను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తొలగించిన పాఠ్యాంశాల జాబితాలో పదవ తరగతి నుండి చార్లెస్‌ డార్విన్‌, జీవ పరిణామ మూలం, పరిణామం, పరిణామ సంబంధాలు, శిలాజాలు, మానవపరిణామ క్రమం చాప్టర్‌లు ఉన్నాయి. ఇవన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన భాగాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

First Published:  21 April 2023 4:26 PM IST
Next Story