Telugu Global
National

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా..

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది.

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా..
X

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుగా 2023లో మొత్తం దేశంలోని 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మూడింటికి ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 3 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు నగారా మోగించింది.

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్‌ జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్‌ కి ఒకేసారి ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు.


ఫలితాలు మార్చి-2న

నాగాలాండ్‌ అసెంబ్లీ గడువు మార్చి 12తో పూర్తవుతుంది. మేఘాలయలో మార్చి 15, త్రిపురలో మార్చి 22తో అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మూడు రాష్ట్రాల్లో మొత్తం 180స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 9125 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 80శాతానికి పైగా పోలింగ్‌ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి. 70శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి, అదేరోజు ఫలితాలు విడుదల చేస్తారు.

అధికార మార్పిడి జరిగేనా..?

త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మేఘాలయ, నాగాలాండ్‌ లో బీజేపీ సంకీర్ణం పెత్తనం కొనసాగుతోంది. ఈ దఫా ఈ మూడుచోట్ల బీజేపీకి ఎదురుగాలి వీచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఇక ఈ ఏడాది మరో 6 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ తర్వాత కర్నాటక, ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి.

First Published:  18 Jan 2023 4:57 PM IST
Next Story