అలా అయితే 75 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఎలా ఉన్నారు?
అభివృద్ధి విషయానికి వస్తే అగ్రపథంలో ఉన్నామని, సంక్షేమ పథకాల ప్రస్తావన రాగానే 75 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారనడంపై సుప్రీంకోర్టు అసహనం

దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అభివృద్ధి విషయానికి వస్తే అగ్రపథంలో ఉన్నామని, సంక్షేమ పథకాల ప్రస్తావన రాగానే 75 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని చెబుతున్నాయని మండిపడింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన రాయితీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్‌సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. కానీ అనర్హులకు కూడా రాయితీలు అందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రేషన్‌కార్డు ప్రస్తుతం పాపులారిటీ కార్డుగా మారిపోయిందని పేర్కొన్నది. రేషన్‌కార్డులను పెద్దసంఖ్యలో జారీ చేస్తున్నట్లు చెబుతున్న రాష్ట్రాలు తలసరి ఆదాయం విషయానికి వస్తే మాత్రం బాగా పెరుగుతున్నదని నివేదిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది ఎలా సాధ్యమని మండిపడింది. కోవిడ్ సమయంలో వలస కార్మికుల కష్టాలపై సుమోటాగా విచారణ చేపట్టిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.