ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీడియాను నిషేధిస్తారా ? ...కేంద్రం పై సుప్రీం కోర్టు ఆగ్రహం
పౌరుల హక్కులను కాలరాయడానికి జాతీయ భద్రత అనే సాకును చూపడంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆ ఛానల్ ప్రసారాల్లో జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి కంటెంట్ తమకు కనపడలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మలయాళ వార్తా ఛానెల్ 'మీడియా వన్'పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఛానెల్ ప్రసార లైసెన్స్‌ను పునరుద్ధరించకూడదన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 'మీడియా వన్' సంస్థ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది.
నాలుగు వారాల్లోగా ఛానెల్‌కు పునరుద్ధరణ లైసెన్స్‌ను జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
ఛానల్ సెక్యూరిటీ క్లియరెన్స్ తిరస్కరణకు గల కారణాలను బహిర్గతం చేయకపోవడం, కోర్టుకు సీల్డ్ కవర్‌లో వివరాలివ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
పౌరుల హక్కులను కాలరాయడానికి జాతీయ భద్రత అనే సాకును చూపడంపై సుప్రీం కోర్టు మండిపడింది. ఆ ఛానల్ ప్రసారాల్లో జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి కంటెంట్ తమకు కనపడలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC), న్యాయవ్యవస్థపై విమర్శలు, మొదలైన వాటిపై వచ్చిన ఛానల్ నివేదికలను ఆధారాలుగా చూపుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆ ఛానల్ ప్రసార లైసెన్స్ పునరుద్ధరణను తిరస్కరించడానికి ఇవి సమర్థనీయమైన కారణాలు కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
" నిజం మాట్లాడటం,కఠినమైన వాస్తవాల గురించి పౌరులకు తెలియజేయడం మీడియా బాధ్యత. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఛానెల్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే అది దేశ వ్యతిరేకం కాదు. మీ అభిప్రాయం ప్రకారమైతే మీడియా ఎల్లప్పుడూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. స్వతంత్ర మీడియా దృఢమైన ప్రజాస్వామ్యానికి అవసరం" అని పేర్కొంది.
జమాతే ఇస్లామీ హింద్‌తో ఛానెల్ వాటాదారులకు లింకులున్నాయనే ఆరోపణలతో ఛానెల్ హక్కులను హరించడం చట్టబద్ధం కాదని సుప్రీం పేర్కొంది. అయినా ఛానల్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు ప్రభుత్వం చేస్తున్న వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు పేర్కొంది.
జాతీయ భద్రత పేరుతో గాలిలోంచి ఆరోపణలు తయారు చేయడం సరైంది కాదని, ఆ ఆరోపణలకు బలం చేకూర్చే వాస్తవాలు కూడా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది.