ఆయనకు జైలుశిక్ష కొనసాగించడం మరణశిక్ష లాంటిదే..
సదరు ఖైదీ ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన విషయం వాస్తవమే కానీ, అతనికి మరణశిక్ష పడలేదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు జైలుశిక్షను కొనసాగించడం మరణశిక్ష లాంటిదేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
జీవితఖైదు అనుభవిస్తున్న 96 ఏళ్ల వృద్ధుడికి ఈ వయసులో శిక్ష కొనసాగించడం మరణశిక్ష లాంటిదేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన వయసు, దిగజారుతున్న ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఆయన్ని విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తన వయసు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని తనకు శాశ్వత పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ సదరు ఖైదీ హబీబ్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
1993 రైలు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన హబీబ్ అహ్మద్ ఖాన్.. 1994లో అరెస్టయ్యాడు. 2004లో అజ్మేర్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. 2016లో సుప్రీంకోర్టు అతడి జీవిత ఖైదు శిక్షను సమర్ధించింది. జైపుర్ జైలులో శిక్ష అనుభవిస్తోన్న అతడికి.. 2018, 2020లో 20 రోజులు చొప్పున పెరోల్ లభించింది. 2021 ఫిబ్రవరిలో మూడోసారి మూడు వారాలకు గానూ పెరోల్ మంజూరైంది. అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పటినుంచి సుప్రీం కోర్టు దాన్ని పొడిగిస్తూ వస్తోంది.
తాజాగా దీనిపై విచారణలో భాగంగా ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనరు వైద్య నివేదికలు చూడాలని, ఆయన నడవలేరు.. కంటి చూపు కూడా సరిగా లేదు.. ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్లగలరు.. ఇలాంటి తరుణంలో ఆయన్ని నిర్బంధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది.. అంటూ వ్యాఖ్యానించింది. సదరు ఖైదీ ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన విషయం వాస్తవమే కానీ, అతనికి మరణశిక్ష పడలేదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు జైలుశిక్షను కొనసాగించడం మరణశిక్ష లాంటిదేనని ధర్మాసనం అభిప్రాయపడింది. 96 ఏళ్ల వయసులో ఆయన తన రోజులు లెక్కబెట్టుకుంటున్నారని, చట్టం అంత కఠినంగా వ్యవహరించకూడదని రాజస్థాన్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్ జీత్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ సందర్భంగా విక్రమ్ జీత్ స్పందిస్తూ.. రెమిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే.. ఉగ్రదాడి కేసులో ఆయనకు శిక్షపడటం దీనికి అడ్డువస్తుందని ఆయన వాదించారు. ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు వద్ద ప్రత్యేక అధికారాలు ఉన్నప్పటికీ.. రెమిషన్ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మానవతా కోణంలో ఆయన రెమిషన్ అంశాన్ని పరిశీలించాలని ధర్మాసనం తెలిపింది. అనంతరం కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.