సావర్కర్ ఓ పక్షిపై కూర్చొని దేశాన్ని చుట్టొచ్చే వాడట... కర్నాటక లో పాఠ్యాంశం, మేధావుల ఆగ్రహం
సావర్కర్ జైల్లో ఉన్నప్పుడు ప్రతి రోజూ ఓ పక్షి మీద ఎక్కి దేశమంతా చుట్టి వచ్చేవాడట. అలా అని కర్నాటక 8వ తరగతి పాఠ్య పుస్తకంలో ఓ పాఠాన్ని ప్రవేశపెట్టారు.
బీజేపీ దేశ చరిత్రను తన భావజాలానికి అనుగుణంగా తిరగరాసే ప్రయత్నం తీవ్రతరం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పిల్లల మెదళ్ళలో అబద్దాలు నింపుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. అబద్దాలు, వక్రీకరణలతో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ కల్పిత కథలనే చరిత్ర గా చలామణి చేస్తున్నారు. కర్నాటకలో ఈ మధ్య 8వ తరగతి పాఠ్యపుస్తకంలో సావర్కర్ మీద ముద్రించిన ఓ పాఠం అబద్దాలే కాదు పిల్లల్లో మూఢనమ్మకాలు కలిగించే విధంగా ఉందని మేదావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ చక్రతీర్థ నేతృత్వంలోని కర్నాటక పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ మొన్నటికి మొన్న స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్, ప్రగతిశీల రచయిత గౌరీ లంకేష్ వంటి వారిపై ఉన్న ఒక అధ్యాయాన్ని తొలగించి, RSS సిద్ధాంతకర్త కె.బి. హెడ్గేవార్ పాఠ్యాంశాన్ని చేర్చిన విషయం తెలిసిందే ఇప్పుడిక సావర్కర్ ను గ్లోరిఫై చేయడం కోసం అబద్దాలతో కూడిన మరో పాఠ్యాంశాన్ని జోడించింది.
ఆ పాఠ్యాంశంలో ఇలా ఉన్నది... "సావర్కర్‌ని జైల్లోని చీకటి గదిలో ఉంచారు, గది లోపల వెనుక గోడ చాలా ఎత్తైనది, అక్కడ ఆకాశం కనపడదు, కాంతి దూరదు. అయితే ఎక్కడి నుంచో బుల్బుల్ పక్షులు ఎగురుతూ సెల్ లోకి వచ్చేవి. వాటి రెక్కలపై కూర్చొని సావర్కర్ ప్రతిరోజూ మాతృభూమిని చుట్టి వచ్చేవారు.''
బుల్బుల్ పక్షులపై కూర్చొని సావర్కర్ భారత దేశం మొత్తం తిరిగేవాడంటే ఎవరైనా నమ్ముతారా ? ఇది చదువుతున్న మీకు కూడా ఆశ్చర్యంతో పాటు నవ్వు కుడా వస్తోంది కదా ! కానీ ఇది హాస్య సన్నివేశం కాదు. పిల్లల బుర్రల్లోకి అబద్దపు విషాన్ని ఎక్కించే అత్యంత సీరియస్ విషయం. అందుకే కర్నాటకలోనే కాదు దేశ వ్యాప్తంగా మేధావులు ఈ పాఠ్యాంశాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బ్రిటిష్ వాళ్ళను క్షమాభిక్ష కోరి, జైలు నుంచి విడుదలై, ఆ తర్వాత జీవితమంతా బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసం పని చేసిన సావర్కర్ ను స్వాతంత్య్ర సమరయోధుడనడమే ఒక తప్పైతే, ఆయన గురించి పాఠ్యాంశం పెట్టడం మరో తప్పని మేధావులు విరుచుకపడుతున్నారు. దీనిపై కర్నాటకలోని అనేక ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కర్నాటక పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ అధినేత రోహిత్ చక్రతీర్థ మాత్రం ఈ పాఠాన్ని సమర్దించుకుంటున్నాడు. కావాలనే సావర్కర్ పాఠంపై కొందరు మేధావులు వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. "మన మేధావుల మేధో స్థాయి నిజంగా ఇంత నీచ స్థాయికి దిగజారిపోయిందా అని ఆశ్చర్యపోతున్నాను. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో చూడలేని సావర్కర్, పక్షి రెక్కపై కూర్చుని మాతృభూమిని చూడడం ఒక రకమైన సాహిత్య అలంకరణ. దీనిని ఉత్ప్రేక్షాలంకారం అనవచ్చు." అని ఆయన అభిప్రాయ పడ్డారు.
"సావర్కర్ పక్షి రెక్కలపై కూర్చొని మాతృభూమికి వెళ్లే వాడనే వాక్యంలో, సావర్కర్ స్వయంగా పక్షి రెక్కలపై కూర్చున్నాడని అర్థం కాదు. కానీ అలా అర్దం చేసుకుంటున్న మన మేధావులు అని పిలవబడే వారిలో ఏదో లోపం ఉంది, "అని ఆయన అన్నారు.
అయితే అధికార భారతీయ జనతా పార్టీకి , దాని సైద్ధాంతిక నాయకురాలైన ఆర్‌ఎస్‌ఎస్‌కు సావర్కర్ అత్యంత ముఖ్యమైన వాడు. కాబట్టే అతన్ని గ్లోరిఫై చేస్తూ ప్రచారం చేయడం వారికి అవసరం అని విమర్శకులు అంటున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కనీస భాగస్వామ్యంలేని ఆరెస్సెస్ సావర్కర్ ద్వారా ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని మేధావుల ఆరోపణ.