బాంబులు పేలొచ్చు, హత్యలు జరగొచ్చు.. మోదీ వ్యూహం ఇదే
దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రాజకీయ లాభం పొందడం బీజేపీకి అలవాటేనన్నారు. అందులో ప్రధాని మోదీ సిద్ధహస్తుడని ఆక్షేపించారు సత్యపాల్ మాలిక్.
గతంలో మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి గవర్నర్ పదవి కోల్పోయిన సత్యపాల్ మాలిక్ మరోసారి వార్తల్లోకెక్కారు. అధికారాన్ని నిలబెట్టుకోడానికి మోదీ ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. సరిగ్గా ఎన్నికల ముందు దేశంలో బాంబులు పేలొచ్చని, బీజేపీ కీలక నేత హత్య కూడా జరగొచ్చని చెప్పారు. వాటి ద్వారా ప్రజల సానుభూతి పొంది ఎన్నికల్లో గట్టెక్కేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని అన్నారు. అయినా కూడా 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని తేల్చి చెప్పారు మాలిక్.
గతంలో పుల్వామా దాడులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సత్యపాల్ మాలిక్. రాజకీయ లాభం కోసమే కేంద్ర ప్రభుత్వం ఆ దాడులపై అసత్యాలు ప్రచారం చేసిందన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ తప్పుడు ప్రచారంతో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని, హర్యానాలో జరుగుతున్న అల్లర్లు క్రమంగా దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ రాజకీయ లాభం పొందడం బీజేపీకి అలవాటేనన్నారు. అందులో ప్రధాని మోదీ సిద్ధహస్తుడని ఆక్షేపించారు.
మోదీ సీన్ అయిపోయింది..
యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ వర్గానికి మోదీ అంటే పడదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 200 కంటే తక్కువ ఎంపీ సీట్లు వస్తే బీజేపీ నాయకులే మోదీని పక్కన పెడతారని పేర్కొన్నారు సత్యపాల్ మాలిక్. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మేఘాలయ, పంజాబ్, హర్యానా, ఛత్తీస్ ఘఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. మోదీ చుట్టూ అంతా అవినీతిపరులే ఉన్నారని ఆరోపించారు సత్యపాల్. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలు, అసమ్మతి నేతలపైకి ఉసిగొల్పుతూ భయపెట్టాలని అనుకొంటున్నారని, వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ కంటే అధ్వాన్నంగా ఉందన్నారు. మణిపూర్ అల్లర్లకు కారణం మోదీయేనని విమర్శించారు సత్యపాల్. మహిళలపై అమానుష ఘటనలు జరిగినా ప్రధాని కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు రోడ్డెక్కి ఆందోళన చేసినా మోదీకి పట్టలేదన్నారు. బేటీ బచావో అంటే ఇదేనా అని నిలదీశారు. వీటన్నిటికీ మోదీ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు సత్యపాల్ మాలిక్.