Telugu Global
National

మోడీని విమర్శించిన ఫలితం: మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్ కు సీబీఐ నోటీసులు

జమ్మూ కాశ్మీర్‌లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తున్న‌ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూ.2,200 కోట్ల విలువైన గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్, సివిల్ వర్క్ కోసం కాంట్రాక్టులు ఇవ్వడంలో అవినీతి లపై మాలిక్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఈ రెండు అంశాలపై సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.

మోడీని విమర్శించిన ఫలితం: మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్ కు సీబీఐ నోటీసులు
X

జమ్ము, కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడి గురించి సత్యపాల్ మాలిక్, ప్రధాని మోడీ, అజిత్ దోవల్ లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసుకు రావడం గమనార్హం. రిలయన్స్ బీమా స్కామ్‌కు సంబంధించి సీబీఐ ఈ నోటీసు జారీ చేసింది.

జమ్మూ కాశ్మీర్‌లోని కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో పని చేస్తున్న‌ ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూ.2,200 కోట్ల విలువైన గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్, సివిల్ వర్క్ కోసం కాంట్రాక్టులు ఇవ్వడంలో అవినీతి లపై మాలిక్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఈ రెండు అంశాలపై సీబీఐ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.

సత్యపాల్ మాలిక్ గతంలో జమ్ము కశ్మీర్ గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కోసం, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేయించే ఫైల్ ను క్లియర్ చేయాలంటూ ఆరెస్సెస్ నాయకుడు రాం మాధవ్ తనకు 300 కోట్ల లంచం ఇవ్వజూపాడని మాలిక్ ఆరోపణలు చేశారు. దాన్ని తాను తిరస్కరించానని ఆయన తెలిపారు.

ఇదే విషయంలో సీబీఐ మాలిక్ కు గతంలో కూడా నోటీసులు ఇచ్చి విచారించింది. ఇది జరిగి చాలా కాలమైనప్పటికీ పుల్వామాపై మాలిక్ ఆరోపణల నేపథ్యంలో సీబీఐ మళ్ళీ ఆయనను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

అయితే సీబీఐ విచారణను తాను ఎదుర్కొంటానని మాలిక్ అన్నారు. నిజాయితీగా ఉన్న తాను దేనికీ భయపడబోనని ఆయన స్పష్టం చేశారు.

కాగా, సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మాలిక్ దేశం ముందు మోడీ గుట్టు బహిర్గతం చేయడం వల్లనే ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయగా దేశం సత్యపాల్ మాలిక్‌కు అండగా నిలుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

"ఈ భయానక కాలంలో మీరు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు సార్, అతను ఒక పిరికివాడు అందుకే మీ మీదికి సీబీఐని పంపించాడు. ఈ గొప్ప దేశంలో సంక్షోభం వచ్చినప్పుడల్లా మీలాంటి వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు.." అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

First Published:  22 April 2023 8:10 AM IST
Next Story