ప్రధాని మోడీతో సత్య నాదెళ్ల భేటీ
టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ తదితర అంశాలపై తాము చర్చించామని ప్రధాని ట్వీట్
కృత్రిమ మేధను విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతీ భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందడానికి వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్ చేశారు.సత్య నాదెల్లతో భేటీ కావడంపై ప్రధాని మోడీ స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ తదితర అంశాలపై తాము చర్చించామన్నారు. భారత్‌లో మైక్రో సాఫ్ట్ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళిక గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మోడీతో యూఎస్ భద్రతా సలహాదారు భేటీ
ప్రధాని మోడీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జెన్ సలీవాన్ భేటీ అయ్యారు. ఈ భేటీ గురించి ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. భారత్-అమెరికా మద్య సహకారం ఉన్నత శిఖరాలకు చేరిందన్నారు.సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, బయో టెక్నాలజీ, కృత్రిమ మేధ రంగాలు సహా భారత్-అమెరికా మద్య అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ అభివృద్ధి కోసం భారత్-అమెరికా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తున్నామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
అంతకుముందు ఐఐటీ-ఢిల్లీలో ప్రసంగించిన జేక్ సలీవాన్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు భారత్-అమెరికా మధ్య సహకారం కీలకమని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌తో అణు ఒప్పందం కుదిరిందని.. రెండు దశాబ్దాలు గడుస్తున్నా అది ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లడానికి అమెరికా ఆలోచిస్తున్నదని తెలిపారు.