యువ క్రికెటర్లకు భలే ఛాన్సు.. జైస్వాల్‌లా అందుకోవాలి మరి
రెండో టెస్ట్‌లో రాహుల్ గైర్హాజరుతో రజత్ పటీదార్‌కు అవకాశం దక్కింది. అతను ఓ మోస్తరుగా ఆడాడు. రాహుల్ ఇప్పుడు తిరిగొచ్చినా అయ్యర్ దూరమైన నేపథ్యంలో ఓ కొత్త ఆటగాడికి అవకాశం దక్కనుంది.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. మరోవైపు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో తప్పుకున్నాడు. ఇప్పటికే పుజారా, రహానే లాంటి సీనియర్లను పక్కనపెట్టిన భారత జట్టు యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి మార్గం సుగమమైంది. మరి దీన్ని జూనియర్లు ఎలా అందుకుంటారో చూడాలి.
పటీదార్, సర్ఫరాజ్‌ఖాన్‌లకు గోల్డెన్ ఛాన్స్
రెండో టెస్ట్‌లో రాహుల్ గైర్హాజరుతో రజత్ పటీదార్‌కు అవకాశం దక్కింది. అతను ఓ మోస్తరుగా ఆడాడు. రాహుల్ ఇప్పుడు తిరిగొచ్చినా అయ్యర్ దూరమైన నేపథ్యంలో ఓ కొత్త ఆటగాడికి అవకాశం దక్కనుంది. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి టీమ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్‌ఖాన్‌కు మూడో టెస్టులో ఛాన్సు రావచ్చు. వీరిద్దరూ దీన్ని ఎలా వాడుకుంటారన్నది ఆసక్తికరం.
జైస్వాల్‌లా ఆడితే ప్లేస్ గ్యారంటీ
రోహిత్, కోహ్లీ ఓ రకంగా కెరీర్ చివరికి వచ్చేసినట్లే. జైస్వాల్, రాహుల్ తప్ప ప్రస్తుతానికి ఎవరి స్థానానికి గ్యారంటీ లేదు. గిల్ ఒక్క ఇన్నింగ్స్‌తో లైన్లో పడే ఆటగాడు కాబట్టి అతన్ని కదపరు. అయినా మూడు బ్యాట్స్‌మన్ స్థానాలకు అవకాశం ఉన్నట్లే. ఒకటి, రెండేళ్ల తర్వాతయినా రెగ్యులర్‌గా ఛాన్సులు వస్తాయి. ఆ అవకాశాలు అందుకోవాలంటే ఇప్పుడు అవకాశం దక్కిన మ్యాచ్‌ల్లో గట్టిగా ఆడాలి. అందుకు జైస్వాల్‌నే స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏడాది తిరక్కముందే అతను టీమ్‌లో గ్యారంటీ ప్లేయర్ అనిపించుకుంటున్నాడంటే కారణం అతని నిలకడైన ఆటతీరే. అదే యువ క్రికెటర్లందరూ చూపించాల్సిన ముఖ్య లక్షణం.