సైగలతో సుప్రీంకోర్టులో వాదనలు తొలిసారిగా..
సైన్ లాంగ్వేజ్ అడ్వొకేట్‌నే కాదు ఆ వ్యాఖ్యాతను కూడా అనుమతించాలని సంచిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు. దానికి సీజేఐ అనుమతి ఇచ్చారు.
సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా ఒక మూగ, చెవిటి న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆమె పేరు సారా సన్నీ. కేరళకు చెందిన సారా సన్నీ సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సంచిత ఐన్ వద్ద గత కొంతకాలంగా జూనియర్‌గా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌గా జరిగిన విచారణలో సంచితతో కలిసి సారా సన్నీ పాల్గొన్నారు. విచారణలో వాదోపవాదనలు సారా సన్నీకి అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్‌లో చెప్పేందుకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్ఎల్) వ్యాఖ్యాత సౌరవ్ రాయ్ చౌదరిని సంచిత నియమించారు. ఈక్రమంలో విచారణ మొదలైంది. అయితే దివ్యాంగ న్యాయవాది సారా సన్నీకి, ఆమెతో పాటు సౌరవ్ రాయ్ చౌదరికి కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ నిరాకరించింది. దీంతో సైన్ లాంగ్వేజ్ అడ్వొకేట్‌నే కాదు ఆ వ్యాఖ్యాతను కూడా అనుమతించాలని సంచిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు. దానికి సీజేఐ అనుమతి ఇచ్చారు.
దీంతో ఈ కేసు విచారణ వివరాలను సౌరవ్ రాయ్ సంజ్ఞలతో సారా సన్నీకి వివరించారు. తనకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించిన సీజేఐ చంద్రచూడ్ కు ఈ సందర్భంగా సారా ధన్యవాదాలు తెలిపారు. ఇక తాను భవిష్యత్తులో వ్యాఖ్యాత సాయంతో వాదనలు వినిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
న్యాయం జరగడంలోనే కాదు న్యాయన్ని నిలబెట్టడంలో కూడా దివ్యాంగులకు సమాన హక్కులు, బాధ్యతలు ఉండాలని కోరే సీజేఐ గతంలో కూడా చాలా మార్పులు చేశారు. గత సంవత్సరం ప్రారంభంలో, దివ్యాంగులకు సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వివరణాత్మక యాక్సెసిబిలిటీ ఆడిట్‌ను ఆదేశించారు. కోర్టుకు వచ్చే వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంటే కాదు దివ్యాంగులైన తన పిల్లలను గతంలో ఒకసారి కోర్టుకు తీసుకు వచ్చి వారికి కోర్ట్ పనితీరును వివరించి వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు.