Telugu Global
National

ఫ్రాన్స్ లో మెరిసిన పోచంపల్లి చీర.. అధ్యక్షుడి భార్యకు బహుమతి

పోచంపల్లి చీరకు విదేశీ గౌరవం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ వేదికలపై పోచంపల్లి కళాత్మకతను ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈసారి ఫ్రాన్స్ ప్రథమ మహిళ ఈ అద్భుతమైన చీరను చూసి పొంగిపోయారు.

ఫ్రాన్స్ లో మెరిసిన పోచంపల్లి చీర.. అధ్యక్షుడి భార్యకు బహుమతి
X

పోచంపల్లి చీరకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ తనతోపాటు పోచంపల్లి ఇక్కత్ సిల్క్ చీరను కూడా తీసుకెళ్లొరు. ఫ్రాన్స్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు మెక్రాన్ భార్యకు ఆ చీరను మోదీ బహూకరించారు.

ఫ్రాన్స్ పర్యటన ముగింపు సందర్భంగా అధ్యక్షుడు మెక్రాన్ కు చందనం చెక్కతో తయారు చేసిన సితారను బహుమతిగా ఇచ్చారు మోదీ. ఫ్రాన్స్ లోని పలువురు ఇతర ప్రభుత్వ ప్రతినిధులకు కాశ్మీరీ కార్పెట్, చందనంతో చేసిన ఏనుగు అంబారీ, మార్బుల్ టేబుల్ బహుమతిగా ఇచ్చారు. వీటన్నిటిలో అధ్యక్షుడి భార్య బ్రిగెట్టికి ఇచ్చిన పోచంపల్లి ఇక్కత్ సిల్క్ చీర హైలెట్ గా నిలిచింది.

పోచంపల్లికి అరుదైన గౌరవం..

పోచంపల్లి చీరకు విదేశీ గౌరవం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ వేదికలపై పోచంపల్లి కళాత్మకతను ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈసారి ఫ్రాన్స్ లో ప్రథమ మహిళ ఈ అద్భుతమైన చీరను చూసి పొంగిపోయారు.

విదేశీయులకు బహుమతులిచ్చేందుకు తెలంగాణ కళాత్మకత ప్రధాని మోదీకి గుర్తొచ్చింది కానీ, ఇక్కడి చేనేత కళాకారులకు సాయం చేయడానికి మాత్రం కేంద్రానికి మనసు రాకపోవడం దురదృష్టకరం. కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కి కేంద్రం పైసా సాయం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం చేనేతల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నూతన ప్రాజెక్ట్ లు తీసుకొస్తూ ఆధునికత జోడిస్తోంది, సంప్రదాయ కళాత్మకతను కాపాడుకుంటోంది. విదేశీ వేదికలపై పోచంపల్లి చీరను గొప్పగా చూపించిన మోదీ.. నేతన్నలకు సాయం చేసేందుకు కూడా ముందుకు రావాలంటున్నారు తెలంగాణవాదులు.

First Published:  15 July 2023 11:00 AM IST
Next Story