ఉదయనిధి చిన్నపిల్లవాడని టార్గెట్ చేశారు.. సనాతన ధర్మంపై కమల్ హాసన్ స్పందన
ఉదయనిధి చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగా.. ఇప్పుడు కమల్ హాసన్ ఉదయనిధిని వెనకేసుకొచ్చేలా మాట్లాడినట్లు కనిపిస్తోంది.
సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి ఉదయనిధి.. దానిని సమూలంగా నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. బీజేపీ అగ్ర నేతలు ఉదయనిధిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు కూడా స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని, ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాల్లో ఎవరినీ నొప్పించకుండా చూసుకోవాలని సూచించింది.
అయితే ఉదయనిధి మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఉదయనిధి చేసిన కామెంట్స్ పై తాజాగా మక్కల్ నీది మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉదయనిధి కంటే ముందు కూడా పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారని చెప్పారు. అయితే ఈ విషయంలో చిన్న పిల్లవాడు అయిన ఉదయనిధిని అందరూ టార్గెట్ చేశారని అన్నారు.
సనాతన అనే పదం పెరియార్ ద్వారానే అందరికీ తెలిసిందన్నారు. నుదుటిపై తిలకం పెట్టుకొని వారణాసిలోని ఓ ఆలయంలో ఆయన పూజలు చేసేవారని చెప్పారు. అటువంటి ఆయనే పూజలను వదిలివేసి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారని, ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటే మాత్రం ఇలా చేస్తారో ఊహించుకోవాలన్నారు.
పెరియార్ జీవితమంతా ప్రజల సేవతోనే గడిచిపోయిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగా.. ఇప్పుడు కమల్ హాసన్ ఉదయనిధిని వెనకేసుకొచ్చేలా మాట్లాడినట్లు కనిపిస్తోంది.
♦