కోరమాండల్ ఘోరం.. సంపర్క్ క్రాంతి జస్ట్ మిస్
ఫిబ్రవరి 8న ఇంటర్ లాకింగ్ వ్యవస్థ లోపంతో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ప్రమాదం బారిన పడాల్సి ఉంది. అప్పుడే సిగ్నలింగ్ లోపాలు సరిచేసి ఉంటే, ఇప్పుడిలా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గాల్లోకి లేచేది కాదు.
కోరమాండల్ ప్రమాదం తర్వాత భారత రైల్వే వ్యవస్థ తప్పిదాలు వరుసగా బయటపడుతున్నాయి. సాక్షాత్తు కాగ్ తిట్టిపోసినా కేంద్రం స్పందించకపోవడంతో ఇప్పుడీ ప్రమాదం జరిగిందని తేటతెల్లమైంది. ప్రమాదానికి ప్రాథమిక కారణాలు, సెకండరీ రిపోర్ట్ లు, సీబీఐ ఎంక్వయిరీ అంటూ ఈ ఎపిసోడ్ ని సాగదీస్తూ తప్పునుంచి తప్పించుకోడానికి దారులు వెదుకుతోంది కేంద్రం. అయితే వరుసగా కేంద్రం చేసిన పాపాలు బయటపడుతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల్ని మూడు నెలల క్రితమే ఓ అధికారి ఎత్తిచూపినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఇప్పుడీ ఘోరం జరిగింది.
ఫిబ్రవరి 8 న జరగాల్సిన ఘోరం
ఫిబ్రవరి 8న సౌత్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పాల్సిన సందర్భం అది. సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఈ విషయాన్ని గుర్తించారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 9న తన ఉన్నతాధికారులకు లేఖ రాశారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ అప్ మెయిన్ లైన్ లో వెళ్లేందుకు ముందుగా సిగ్నల్ ఇచ్చారని, ఆ రైలు కొద్దిదూరం వెళ్లాక డౌన్ మెయిన్ లైన్ లో వెళ్లేలా ఇంటర్ లాకింగ్ ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. లోపాన్ని గుర్తించిన లోకోపైలట్ అప్రమత్తం కావడంతో ఆరోజు ఘోర ప్రమాదం తప్పిందని వివరించారు. రైలును వెంటనే నిలిపివేశారన్నారు. ఇంటర్ లాకింగ్ ఉన్న ప్రకారం రైలు అదే లైన్లో వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదేనని చెప్పారు. సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని, వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఫిబ్రవరి 8న ఇంటర్ లాకింగ్ వ్యవస్థ లోపంతో సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ప్రమాదం బారిన పడాల్సి ఉంది. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ లేఖతో అయినా ఉన్నతాధికారులు స్పందించి ఉంటే ఇప్పుడీ ఘోరం జరిగేది కాదు. అప్పుడే సిగ్నలింగ్ లోపాలు సరిచేసి ఉంటే, ఇప్పుడిలా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గాల్లోకి లేచేది కాదు. వందల ప్రాణాలు పోయేవి కావు. ఫిబ్రవరిలో రాసిన లేఖ ఇప్పుడీ ప్రమాదం తర్వాత సంచలనంగా మారింది. రైల్వే వ్యవస్థలోని లోపాలను మరోసారి ఎత్తి చూపింది.