Telugu Global
National

కాశీ కారిడార్ లో ధ్వంసమైన 143 ఆలయాలకు మోక్షమెప్పుడు?

భారత దేశంలోని అనేక ఆలయాలు, నిర్మాణాలు, కోటలు.. హమ్మదీయుల దండయాత్రలో నేలమట్టం అయ్యాయి.

కాశీ కారిడార్ లో ధ్వంసమైన 143 ఆలయాలకు మోక్షమెప్పుడు?
X

భారత దేశంలోని అనేక ఆలయాలు, నిర్మాణాలు, కోటలు.. హమ్మదీయుల దండయాత్రలో నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. కానీ వీటికి కారణం హిందువులే కావడం ఆందోళన కలిగించే అంశం. అప్పట్లో రాజ్యకాంక్షతో మహ్మదీయులు దండెత్తి వస్తే, ఇప్పుడు తమ ఆధిపత్య ధోరణితో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పైగా తమది హిందూత్వ పార్టీ అని గట్టిగా చెప్పుకునే బీజేపీ హయాంలో ఇలాంటి దారుణాలు జరగడం విశేషం.

కాశీ కారిడార్ కోసం..

హిందువుల పుణ్యక్షేత్రం కాశీలో విశ్వేశ్వరుడి ఆలయానికి దారితీసే మార్గాలు ఇరుకిరుకుగా ఉంటాయి. గంగానది ఘాట్ ల నుంచి కాశీ ఆలయాన్ని నేరుగా చూడలేం. కాశీ ప్రధాన ఆలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆలయాలలో స్థానికులే నివాసం ఉంటూ పూజలు చేస్తుండేవారు. కాలక్రమంలో అవే వారి నివాసాలయ్యాయి. అయితే కాశీ కారిడార్ అనే పథకం ద్వారా ఆ నివాసాలను, గుడులను నేలమట్టం చేశారు నేతలు. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 143 చిన్న చిన్న ఆలయాలు ఈ కారిడార్ వల్ల ధ్వంసమయ్యాయి. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకోసం కాశీ కారిడార్ పేరుతో విధ్వంసం సృష్టించారని ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శిస్తున్నారు స్థానికులు.

పునర్నిర్మాణం ఎక్కడ..?

పోనీ అభివృద్ధి పనుల ద్వారా కొంత ఇబ్బంది కలుగుతుందని అనుకుందాం. మరి తొలగించిన ఆ ఆలయాలను ఎక్కడ పునర్నిర్మిస్తున్నారు? బుల్డోజర్లతో అక్కడినుంచి పెకలించివేసిన శివలింగాలను ఎక్కడ తిరిగి ప్రతిష్టించారు? వీటన్నిటినీ కొత్తగా కడుతున్న ఆలయ కాంప్లెక్స్‌ కి తరలిస్తామని గతంలో మోదీ హామీ ఇచ్చారు. రెండేళ్లు పూర్తవుతున్నా విగ్రహాలను పట్టించుకునే నాథుడే లేడు. విచిత్రం ఏంటంటే.. ఈ చిన్న చిన్న ఆలయాలను కూల్చివేసే సమయంలో హిందూ కార్మికులు విగ్రహాలను పెకలించే సాహసం చేయలేదట. తమ చేతులతో ఆ పాపం తాము చేయలేమన్నారట. దీంతో ప్రత్యామ్నాయంగా ఇతర వర్గాల వారితో ఆ పనిచేయించారట అధికారులు.

ఎందుకీ పాపం..?

ప్రధాని మోదీది కార్పొరేట్ స్టైల్ అతివాదం. ఆయన అనుకున్నారంటే అది జరిగి తీరాల్సిందే, అందుకే పార్లమెంట్ భవన నిర్మాణంపై అన్ని ఆరోపణలు వచ్చినా జరిగి తీరాల్సిందేనంటున్నారు. కాశీ కారిడార్ విషయంలో చాలామంది భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఆయన ఒప్పుకోలేదు. పైగా కారిడార్ ప్రారంభోత్సవంలో శివుడిపైనే జోకులేశారు. ఇప్పటి వరకూ పరమేశ్వరుడు ఇరుకిరుకు మార్గంలో ఊపిరి తీసుకోలేకుండా ఉన్నారని, ఆయనకు విముక్తి కలిగించామన్నారు. పురాతన సంప్రదాయాలను, సాంప్రదాయక నిర్మాణాలను ధ్వంసం చేయడమే ఆధునికతా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. వంశ పారంపర్యంగా తమ అధీనంలో ఉన్న చిన్న చిన్న గుడులని ధ్వంసం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలవలేక కోర్టులకు వెళ్లే సాహసం చేయలేదు. పొట్ట పోషణ కోసం ఇప్పుడు కాశీలో వీధి వ్యాపారులుగా మారిపోయారు.

సంప్రదాయాలను తుంగలో తొక్కారు..

దేశవ్యాప్తంగా భక్తులు చేపట్టే 84 రకాల దీక్షలు కాశీలోని వ్యాసపీఠం వద్ద ముగుస్తాయి. అంటే ఆ పీఠం వద్దకు చేరుకోవటంతో ఆ దీక్షలు పూర్తవుతాయి. శతాబ్దాల నాటి ఆ పీఠాన్ని కూడా కారిడార్ పనుల్లో భాగంగా తొలగించారు. సంప్రదాయాలను ధ్వంసం చేశారు. కాశీలోని ప్రధాన ఆలయానికి చుట్టూ వినాయకుడు, దుర్గ, శివ, విష్ణు, సూర్య ఆలయాలు ఉండేవి. వాటిని దర్శించుకొని వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయకపోతే కాశీ పర్యటన పూర్తయినట్లు కాదనేది భక్తుల విశ్వాసం. కారిడార్‌ కోసం ఈ ఆలయాలను కూడా కూల్చివేశారు. ముక్తి మండపం (విశ్వనాథ సభ) కూడా ధ్వంసానికి గురైంది. హిందూ ధర్మంపై విశ్వాసమున్న వారెవరూ చేయలేని ఘోరాన్ని చేశారన్నది అక్కడి స్థానికుల మాట.

జ్ఞానవాపిలో శివలింగం కావాలా..?

కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందనే వాదన ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది. కాశీలో వందలాది శివలింగాలను కూలదోసి, డ్రైనేజీల్లో పడేసి, విధ్వంసం సృష్టించిన వీరు జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికితే ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ముందు ధ్వంసమైన ఆలయాల సంగతి చూడండి, పక్కన పడేసిన శివలింగాలను నిలబెట్టండి అని నిలదీస్తున్నారు. కేవలం వారి అహాన్ని తృప్తిపరచుకోడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా రోడ్డుపై ఒక చిన్న మందిరం కూల్చేస్తే నానా రభస చేసే 'సంఘ్ పరివార్ లు', 'పరిషత్తులు' ఈ దారుణ కారిడార్ విధ్వంసం గురించి నోరు మెదపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని, కూలదోసిన అన్ని శివలింగాలు పూజకు నోచుకునేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

First Published:  19 July 2022 11:45 AM IST
Next Story