Telugu Global
National

సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు.. లాకప్ లో నిందితుడి ఆత్మహత్య

బుధవారం ఉదయం పోలీసులు సాధారణ తనిఖీ కోసం వెళ్లగా లాకప్ కు అనుబంధంగా ఉన్న టాయిలెట్ లో అనూజ్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు.

సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు.. లాకప్ లో నిందితుడి ఆత్మహత్య
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివాసం ఉంటున్న సల్మాన్ ఖాన్ ఇంటిపై గత నెల 14న కొందరు వ్యక్తులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విక్కీ గుప్తా, సాగర్ పాల్ కాల్పులకు పాల్పడినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు.

అయితే వీరికి ఆయుధాలను సరఫరా చేశారన్న ఆరోపణలతో అనూజ్ తపన్ (32), సోను సుభాష్ చందర్ అనే మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ పోలీస్ కస్టడీలో ఉండగా తాజాగా అనూజ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రించేందుకు జైలు సిబ్బంది ఇచ్చిన దుప్పటితో అనూజ్ ఉరి వేసుకున్నాడు.

బుధవారం ఉదయం పోలీసులు సాధారణ తనిఖీ కోసం వెళ్లగా లాకప్ కు అనుబంధంగా ఉన్న టాయిలెట్ లో అనూజ్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే అతడిని ఆస్ప‌త్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే లాకప్ లో అనూజ్ ఉరేసుకుని చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనూజ్‌ది ముమ్మాటికీ హత్యేనని మహారాష్ట్ర మాజీ సీనియర్ పోలీస్ అధికారి పీకే జైన్ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసు లాకప్ లో ఎవరు మరణించినా దానిని హత్యగానే పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. లాకప్ నుంచి ఖైదీలు తప్పించుకోకుండా.. ఆత్మహత్యలకు పాల్పడకుండా.. పోలీసులు నిఘా పెట్టి ఉంటారని.. అయినప్పటికీ ఈ సంఘటన జరగడంలో పోలీసుల పాత్ర ఉండి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

First Published:  1 May 2024 9:50 PM IST
Next Story