హ్యాండ్ బ్యాగ్ లో లిప్ స్టిక్ వద్దు.. అమ్మాయిలకు సాధ్వి సలహా
ఈ ఏడాది మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మతపరమైన చిచ్చు పెట్టేందుకే సాధ్విలాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆడవాళ్లు హ్యాండ్ బ్యాగ్ లో లిప్ స్టిక్, దువ్వెన, మేకప్ కిట్ లాంటి సామగ్రి పెట్టుకోవడం సహజం. అయితే ఇకపై అలాంటివేవీ పెట్టుకోవద్దని సలహా ఇచ్చారు విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచి. వాటి స్థానంలో కత్తులు పెట్టుకుని తిరగాలన్నారు. జీహాదీలకు దగ్గరవ్వకుండా ఉండాలంటే హిందూ మహిళలు ఇలాంటివి బ్యాగ్ లో పెట్టుకోవాలని చెప్పారు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను నరికి చంపిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. హిందూ మహిళలు కత్తులు వెంటపెట్టుకుని ఉండాలని అన్నారు సాధ్వి ప్రాచి. గతంలో కూడా ఆమె పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు మరోసారి లవ్ జీహాద్ పేరుతో ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లాకు చెందిన సాధ్వి ప్రాచి 14 ఏళ్ల వయసులో మతపరమైన కార్యకలాపాలకు అంకితమయ్యారు. అప్పటినుంచి ఆమె కాషాయం ధరిస్తూ బోధనలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మతపరమైన చిచ్చు పెట్టేందుకే సాధ్విలాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాధ్వి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.