Telugu Global
National

మాకు కీడు జరగాలని కేరళలో యాగం.. - డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వారు చేసే ప్రయత్నాలు వారిని చేయనివ్వండి.. తాను దాని గురించి ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. వారి విశ్వాసం వారిదని, ఈ యాగం నుంచి తాను నమ్మే దేవుడు కాపాడతాడనే నమ్మకం తనకు ఉందని డీకే శివకుమార్ చెప్పారు.

మాకు కీడు జరగాలని కేరళలో యాగం.. - డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
X

తనకు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కీడు జరగాలని, తమకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలో శత్రు భైరవి యాగ ప్రయోగం జరుగుతోందని కేపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యాగంలో పలువురు అఘోరాలు పాల్గొన్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. గురువారం డీకే శివకుమార్ బెంగళూరులో మాట్లాడుతూ.. తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాశనం కోరుకుంటూ కేరళలో కొందరు ప్రత్యేక యాగం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేరళలోని రాజరాజేశ్వరి ఆలయ సమీపంలో శత్రువులను అంతమొందించేందుకు చేసే రాజకంటకం, మరన్ మోహన స్తంభన యాగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేరళలో తమకు వ్యతిరేకంగా ఎవరు యాగం చేస్తున్నారో వారి వివరాలు తనకు అందినట్లు శివకుమార్ చెప్పారు. అఘోరాల ఆధ్వర్యంలో పంచబలి యాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ యాగం విజయవంతం చేసేందుకు మేకలు, గేదెలు, నల్ల రంగు గొర్రెలు, పందులను బలి ఇస్తున్నారని ఆరోపించారు.

వారు చేసే ప్రయత్నాలు వారిని చేయనివ్వండి.. తాను దాని గురించి ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. వారి విశ్వాసం వారిదని, ఈ యాగం నుంచి తాను నమ్మే దేవుడు కాపాడతాడనే నమ్మకం తనకు ఉందని డీకే శివకుమార్ చెప్పారు.

కేరళలో జరుగుతున్న యాగానికి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇస్తూ.. వారు కాకుంటే ఇంకెవరు ఉంటారంటూ సమాధానం ఇచ్చారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రత్యేకంగా యాగాలు చేస్తున్నారా? అని అడిగిన మరో ప్రశ్నకు.. అలాంటి యాగాలు తామేమీ చేయడం లేదని చెప్పారు. తాను దేవుడిని మాత్రమే నమ్ముతానని ఆ శక్తే తనను కాపాడుతుందని పేర్కొన్నారు. సీఎం సిద్ధరామయ్య, తనకు వ్యతిరేకంగా కేరళలో పంచబలి యాగం జరుగుతోందని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

First Published:  31 May 2024 2:21 AM GMT
Next Story