Telugu Global
National

విధేయతకే పట్టం.. పైలట్ కే పగ్గాలు..!!

2020లోనే పైలట్ వర్గం పార్టీని వీడాలని భావించింది. కానీ రాహుల్ గాంధీ హామీతో ఆయన మనసు మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పేరుతో అనుకోకుండా పైలట్‌కి అదృష్టం వరించింది.

విధేయతకే పట్టం.. పైలట్ కే పగ్గాలు..!!
X

కాగల కార్యం గంధర్వులే తీరుస్తారంటే ఇదేనేమో.. అప్పట్లో సీఎం సీటు కోసం సచిన్ పైలట్ హడావిడి చేసినా ఆ తర్వాత రాహుల్ గాంధీ బుజ్జగింపులతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన అనుకోకుండా ఆ సీఎం సీటుకు దగ్గరవుతున్నారు. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా వెళ్లిపోతే ఇక రాజస్థాన్‌లో పైలట్‌దే పెత్తనమంతా. అయితే చివరి నిమిషంలో స్పీకర్ పేరు తెరపైకి తెచ్చి గెహ్లాత్ పొలిటికల్ గేమ్ ఆడాలనుకున్నా.. పైలట్ విధేయతకే అధిష్టానం పట్టం కట్టేలా ఉంది.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కుర్చీ ఆశించిన సచిన్ పైలట్, అది సీనియర్ అయిన గెహ్లాత్ కి వెళ్లిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 2020లోనే పైలట్ వర్గం పార్టీని వీడాలని భావించింది. కానీ రాహుల్ గాంధీ హామీతో ఆయన మనసు మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పేరుతో అనుకోకుండా పైలట్‌కి అదృష్టం వరించింది.

జోడు పదవుల సందిగ్ధత వీడటంతో..

కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలనుకుంటున్న రాజస్థాన్ సీఎం అశోగ్ గెహ్లాత్.. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. సోనియా గాంధీతో కలసి మాట్లాడారు. ఒకవేళ తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానని చెప్పుకొచ్చారు. కానీ రాహుల్ గాంధీ జోడు పదవులపై క్లారిటీ ఇవ్వడంతో గెహ్లాత్ వెనక్కు తగ్గారు. ఆ తర్వాత ఆయన తెలివిగా స్పీకర్ సీపీ జోషి పేరు తెరపైకి తెచ్చారు. ఆయనే తన తర్వాత సీఎం అన్నారు. కానీ అధిష్టానం మనసులో మరో ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడైనా ఆ అవకాశం సచిన్ పైలట్‌కి ఇస్తే సమన్యాయం జరుగుతుందని భావిస్తోంది అధిష్టానం.

అందరి మద్దతు ఆయనకేనా.. ?

మరోవైపు సచిన్ పైలట్‌కి మద్దతుగా ఆల్రడీ ఎమ్మెల్యేలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. గెహ్లాత్ తర్వాత సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు రాజస్థాన్ మంత్రి రాజేంద్ర గుఢా. రాజేంద్ర గుఢా ఆధ్వర్యంలోని ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్‌లో విలీనం అయ్యారు. ఇప్పుడు వారంతా తమ మద్దతు పైలట్‌కే నంటున్నారు. గెహ్లాత్ తర్వాత పైలట్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నా, అందరి మద్దతు పైలట్‌కే ఉంటుందని తెలుస్తోంది. అంటే అటు అధిష్టానం, ఇటు ఎమ్మెల్యేల మద్దతుతో పైలట్ రాజస్థాన్ పగ్గాలు చేపడతారన్నమాట. అనుకోకుండా కాంగ్రెస్ అధ్య‌క్ష‌ ఎన్నికల వ్యవహారం ఇలా సచిన్ పైలట్‌కి కలిసొస్తోంది.

First Published:  24 Sept 2022 3:15 AM GMT
Next Story