సచిన్ పైలట్ నిరాహార దీక్ష.. అధిష్టానం వద్దన్నా తగ్గేదే లే..
జైపూర్ లో సచిన్ పైలట్ నిరాహార దీక్ష ప్రారంభించారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా కూడా అవినీతికి వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగడం ప్రతిపక్షాలకు ఓ అవకాశంగా మారింది. అధిష్టానానికి పెద్ద తలనొప్పి అవుతోంది.
ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ అక్కడ పట్టు నిలుపుకోడానికి శత విధాల ప్రయత్నం చేస్తోంది. అయితే అక్కడి గ్రూపు రాజకీయాలు అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉన్న సచిన్ పైలట్ సరిగ్గా ఎన్నికల ఏడాది మళ్లీ తన అసమ్మతి స్వరం పెంచారు. సీఎం అశోక్ గెహ్లాత్ కి వ్యతిరేకంగా ఆయన ఈరోజు నిరాహార దీక్ష మొదలు పెట్టారు.
అధిష్టానం వద్దన్నా..
జైపూర్ లో సచిన్ పైలట్ తన నిరాహార దీక్షను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగా షహీద్ స్మారక్ స్థల్ వద్ద దీక్షకు కూర్చున్నారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా కూడా అవినీతికి వ్యతిరేకంగా ఆయన దీక్షకు దిగడం ప్రతిపక్షాలకు ఓ అవకాశంగా మారింది. అధిష్టానానికి పెద్ద తలనొప్పి అవుతోంది. నిరాహార దీక్ష వద్దని అధిష్టానం రెండురోజులుగా పైలట్ ని హెచ్చరిస్తూ వచ్చింది. సొంత ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే మీడియా, పబ్లిక్ లో కాకుండా పార్టీ ఫోరమ్ లో చర్చించాలంటూ రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ సుఖ్ జీందర్ సింగ్ రంధావా స్పష్టం చేశారు. దీక్ష వద్దని బుజ్జగించారు, ఓ దశలో కాస్త హెచ్చరిస్తూ లేఖ పంపించారు. కానీ సచిన్ పైలట్ వెనక్కి తగ్గలేదు.
ఎందుకీ దీక్ష..?
బీజేపీకి చెందిన మాజీ సీఎం వసుంధర రాజేపై వచ్చిన ఆరోపణల విషయంలో సీఎం అశోక్ గెహ్లాత్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. వసుంధర రాజెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని కొన్నాళ్లుగా సచిన్ పైలట్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ వివిధ రాజకీయ కారణాలతో గెహ్లాత్ ఆ పని చేయలేదు. దీంతో సచిన్ నిరాహార దీక్షకు దిగారు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.
గతంలో సీఎం కుర్చీపై ఆశపడ్డ సచిన్ పైలట్.. కాంగ్రెస్ ని వీడేందుకు కూడా సిద్ధమయ్యారు. అప్పట్లో హైకమాండ్ జోక్యంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఓ దశలో అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ అధ్యక్షుడిగా వెళ్తే తనకు సీఎం సీటు దక్కుతుందని ఆశించారు, అది కూడా నెరవేరలేదు. తీరా ఇప్పుడు ఎన్నికల ఏడాది సొంత పార్టీని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిరాహార దీక్షపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాల్సి ఉంది.