భక్తులతో శబరిమల కిటకిట.. - ఒక్కరోజే లక్ష మందికి పైగా దర్శనం
సోమవారం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌లో లక్షా 10 వేల మంది రిజిస్టర్ చేయించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. పంపానది నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోందని తెలిపారు.
శబరిమల పుణ్యక్షేత్రం అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. అయ్యప్ప నామస్మరణతో క్షేత్రం మార్మోగుతోంది. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే లక్షమందికి పైగా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఇంకా లక్షలాదిమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీకి వర్షం తోడవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తుల క్యూలైన్లు పంపా నది వరకు సుదీర్ఘంగా ఉన్నాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.
సోమవారం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌లో లక్షా 10 వేల మంది రిజిస్టర్ చేయించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. పంపానది నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోందని తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్నదానం, తాగునీరు అందజేతలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటున్నారు. భక్తుల రద్దీ వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.