Telugu Global
National

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. ఆ అద్భుతం ఇదేనా మోదీజీ..!

డాలర్‌ బలపడటంతో పాటు విదేశీ నిధులు దేశీయ మార్కెట్‌ నుంచి తరలిపోవడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగి ప్రారంభంలో ఉన్న లాభాలు పోగొట్టుకుంది. మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో 82.69 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83 వరకు దిగజారింది.

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. ఆ అద్భుతం ఇదేనా మోదీజీ..!
X

2022 తర్వాత అద్భుతం జరుగుతుంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటలు అక్షర సత్యం. ఆ అద్భుతం జరిగింది కూడా. డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి జీవిత కాల కనిష్టానికి చేరుకుంది. అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి మరో 22 పైసలు దిగజారి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 83 వద్ద క్లోజ్ అయింది. 2023 జనవరి 1న గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచి షాకిచ్చింది కేంద్రం. మూడో తేదీ రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయి మరో షాక్ నమోదైంది. 2023 సంవత్సరంలో ఇంకెన్ని ఘోరాలు చూడాలో అంటూ వ్యాపార వర్గాలు భయపడుతున్నాయి.

డాలర్‌ బలపడటంతో పాటు విదేశీ నిధులు దేశీయ మార్కెట్‌ నుంచి తరలిపోవడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగి ప్రారంభంలో ఉన్న లాభాలు పోగొట్టుకుంది. మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో 82.69 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 83 వరకు దిగజారింది. చివరికి కోలుకుంటుందని అనుకున్నా అదే స్థానంలో ముగిసింది.

పతనానికి పరాకాష్ట..

2021 అక్టోబరు 19వ తేదీ తర్వాత ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. త్వరలోనే రూపాయి 83.50-83.70 స్థాయికి చేరవచ్చని రీసెర్చ్‌ అనలిస్ట్‌ ల అభిప్రాయం.

నిర్మలమ్మ సమాధానం అదేనా..?

రూపాయి జీవిత కాల కనిష్టానికి చేరుకున్నా కూడా జీవిత కాల సమాధానం గతంలోనే ఇచ్చేశారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. రూపాయి పతనాన్ని కేవలం డాలర్ బలంగా తేల్చి చెప్పారు. గత పార్లమెంట్ సెషన్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నిర్మలమ్మ ఇచ్చిన సమాధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మన బలహీనతలను ఒప్పుకోవాల్సిన సందర్భంలో కూడా ఆమె ఎదుటివారి బలాలను పొగడటం ఆశ్చర్యం అనిపించింది. రూపాయి పతనానికి కారణం తమ ఆర్థిక విధానాలు కావని, డాలర్ బలపడటమేనని ఆమె చెప్పిన కారణం సంచలనంగా మారింది. ఇక రూపాయి ఎప్పుడు పతనమైనా.. ఆమెది అదే సమాధానం అని అన్వయించుకోవాల్సిందే.

First Published:  4 Jan 2023 7:34 AM IST
Next Story