Telugu Global
National

ఇచట 2వేల నోట్లు తీసుకోబడవు..

హైదరాబాద్ లోని ఓ స్వీట్ షాపులో ఒక నోటీసు అంటించారు. ప్రస్తుతం మా దగ్గర 2వేల నోటు తీసుకొనబడదు.. అనేది ఆ నోటీస్ సారాంశం. అయితే కారణం మాత్రం యాజమాన్యం చెప్పట్లేదు.

ఇచట 2వేల నోట్లు తీసుకోబడవు..
X

ఇటీవల వాట్సప్ లో 2వేల రూపాయల కరెన్సీ నోటు గురించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇకపై 2వేల రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రించడంలేదని, వాటిని పూర్తిగా పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలామంది మెసేజ్ లు ఫార్వార్డ్ చేస్తున్నారు. బ్యాంకులు కూడా 2వేల రూపాయల నోట్లు తీసుకుంటాయి కానీ, తిరిగి కస్టమర్లకు మాత్రం ఇవ్వట్లేదనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియదు కానీ ఆర్బీఐ తరపున కూడా ఎలాంటి క్లారిటీ లేదు. దీనికి తోడు చలామణిలో ఉన్న 2వేల రూపాయల నోట్ల సంఖ్య కూడా గతంతో పోల్చి చూస్తే తక్కువగా ఉండటంతో అందరిలో అనుమానాలు అలాగే ఉన్నాయి. ఈ అనుమానాలతోనే కొంతమంది వ్యాపారులు కూడా 2వేల రూపాయల నోటు అంటేనే భయపడిపోతున్నారు.

హైదరాబాద్ లోని ఓ స్వీట్ షాపులో తాజాగా ఇలాంటి నోటీసు ఒకటి అంటించారు. ప్రస్తుతం మా దగ్గర 2వేల నోటు తీసుకొనబడదు.. అనేది ఆ నోటీస్ సారాంశం. అయితే కారణం మాత్రం యాజమాన్యం చెప్పట్లేదు. కేవలం 2వేల నోట్లు మాత్రం తీసుకోవట్లేదు అని చెబుతున్నారంతే. ఆర్బీఐ ఆమోదించిన కరెన్సీ నోట్లని కూడా తీసుకోబోము అని చెప్పేందుకు ఎవరికీ హక్కు లేదు. కానీ ప్రైవేట్ వ్యాపారం కదా, అందుకే వాళ్లు బోర్డ్ పెట్టి మరీ కస్టమర్లకు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అవసరమైతే ఆ బేరం మాకు వద్దు అంటున్నారు కానీ 2వేల రూపాయల నోటు మాత్రం తీసుకోవట్లేదు.

ఆర్బీఐ ఏం చెబుతోంది..?

ఆర్బీఐ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రస్తుతానికి 2వేల రూపాయల నోటు వ్యవహారంపై నోరు మెదపడం లేదు. గతంలో 2వేల నోటు రద్దుపై కేంద్రం స్పందించింది, అదంతా వట్టి పుకారేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవసరం వచ్చింది. ఏకంగా వ్యాపారులే 2వేల రూపాయల నోట్లు మాకొద్దు అంటూ నోటీసు బోర్డులు పెడుతున్నారంటే సామాన్యులకు మరింత కన్ఫ్యూజన్ ఉన్నట్టే లెక్క. ఈ కన్ఫ్యూజన్ తొలగించాలంటే కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. లేకపోతే మోదీ ఎప్పుడు తెరపైకి వస్తారో, 2వేల నోటు గురించి ఎలాంటి బాంబు పేలుస్తారోనని ప్రజలు భయపడుతూ ఉండాల్సిందే.

First Published:  15 Feb 2023 12:43 PM IST
Next Story