Telugu Global
National

మ‌హిళలను ఆకర్షించడానికి ఆరెస్సెస్ ప్రణాళికలు!

తమ సంస్థలో మహిళలు లేని లోటు భర్తీ చేసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావిస్తోంది. అందుకోసం తన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల ద్వారా మహిళలను ఆర్గనైజ్ చేయడానికి భారీ ప్రణాళికలు రచిస్తోంది.

మ‌హిళలను ఆకర్షించడానికి ఆరెస్సెస్ ప్రణాళికలు!
X

ఆరెస్సెస్ మహిళలను ఆకర్షించడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటి వరకు ఆరెస్సెస్ లో మహిళలెవరూ ప్రధానమైన పదవుల్లో లేకపోవడం ఆ సంస్థకు ఇబ్బంది కలిగించే అంశమే. ఈ సంస్థ 1936 లోనే మహిళల కోసం ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేసినప్పటికీ దానిపై ఆరెస్సెస్ నాయకులు ఎప్పుడూ దృష్టి సారించలేదు. ఇటీవల, సంఘ్ ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ, ఆ సమావేశంలో మహిళలు పెద్దగా పాల్గొనకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. "ఈ సెమినార్‌లో మరికొంత మంది మహిళలు పాల్గొంటే బావుండేది. మహిళా స్పీకర్లు కూడా ఒక్కరూ లేరు'' అని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ 1936లో వార్ధాలో లక్ష్మీబాయి కేల్కర్ నేతృత్వంలో రాష్ట్ర సేవికా సమితి అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కె బి హెడ్గేవార్ బతికున్నప్పుడు ఏర్పాటు చేసిన ఆ సంస్థ ఇప్పటికీ ఎక్కడవేసిన గొంగళి అక్కడనే అనే విధంగా ఉంది. ఇందులో హోల్‌టైమర్లను "ప్రచారికలు" అని పిలుస్తారు. ఈ ప్రచారికలు కానీ, సమితిలో ఉన్న ఇతర పోస్టుల్లో ఉన్న వాళ్ళుగానీ ముఖ్యంగా ఆరెస్సెస్ లో ఉన్న మగవాళ్ళ బంధువులే.

RSS 2021,22లో విడుదల చేసిన‌ వార్షిక నివేదిక ప్రకారం 41 రాష్ట్రాలలో(ఆరెస్సెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రాష్ట్రాలను కాక తనకు అనుగుణమైన రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంది.) ఆ సంస్థకు మహిళా విభాగాలున్నాయి. అయితే అవి నామమాత్రంగానే ఉన్నాయి.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం సంఘ్‌లో ఎక్కువ మంది మహిళలను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభమైంది. ఇప్పుడు, రాష్ట్ర సేవికా సమితి మాత్రమే కాకుండా, RSS కూడా మహిళలకు చేరువయ్యే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దాని 'కుటుంబ ప్రబోధన్' పథకంలో భాగంగా, 41 రాష్ట్రాలలో కన్వీనర్లతో, దేశంలోని వివిధ ప్రదేశాలలో "పరివార్ సమ్మేళన్ (కుటుంబ సమావేశాలు)" నిర్వహిస్తోంది. ఈ పథకం యొక్క లక్ష్యం కుటుంబాలను ఆర్గనైజ్ చేయడం, వాళ్ళను హిందుత్వ రాజకీయాలవైపు నడిపించడం.

అంతేకాకుండా, RSS దేశంలోని వివిధ ప్రాంతాల్లో "మహిళా సమ్మేళనాలు" నిర్వహిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో వారణాసిలో "మాతృశక్తి (తల్లి శక్తి) కుంభం" జరిగింది. వారణాసి సమావేశంలో దాదాపు 10,000 మంది మహిళలు పాల్గొన్నారని ఆర్‌ఎస్‌ఎస్ నివేదిక పేర్కొంది, అందులో 31 మంది పూర్తి కాలం మహిళా కార్యకర్తలున్నారని ఆరెస్సెస్ నివేదిక తెలిపింది.

RSS స్త్రీల విషయంలో తిరోగమన భావజాలంతో ఉంటుంది. తిరోగమన విలువలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పితృస్వామిక భావజాలమే ఆరెస్సెస్ కు ప్రధానమైనది అందువల్ల స్త్రీలను ఆర్గనైజ్ చేసే విషయంలో ఆరెస్సెస్ కొంత మెళుకువ ప్రదర్శిస్తోంది. అందుకే హిందూ మహిళలు ఒక్కొక్కరు నలుగురు పిల్లలను కనాలన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మాటలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు. ''మా తల్లులు పిల్లలు కనే యంత్రాలు కాదు బిడ్డకు జన్మనివ్వడం వాళ్ళ వ్యక్తిగతమైనది'' అని ఆయన అన్నారు.

భారతీయ కిసాన్ సంఘ్ (రైతు విభాగం), భారతీయ మజ్దూర్ సంఘ్ (కార్మిక విభాగం) విద్యా భారతి (విద్యా విభాగం) మరియు ABVP వంటి సంఘ్ సంస్థలలో ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవడంపై దృష్టి సారించింది.

మనుస్మృతిని తన రాజ్యాంగంగా భావించే ఆరెస్సెస్ మహిళలను ఆర్గనైజ్ చేయడం కొంత వింతైన విషయమే అయినప్పటికీ అది వాళ్ళకు ఎంత అవసరమో మాత్రం అర్దమవుతోంది.

First Published:  26 July 2022 4:09 PM IST
Next Story