నితిన్ గడ్కరి ఇక రాజకీయాలు వదిలేయాల్సిందేనా?
గత మూడేళ్లుగా గడ్కరి వ్యవహార శైలిని గమనిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ.. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉంటూ.. ఏకంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.
బీజేపీలో నితిన్ గడ్కరికి పొగ పెడుతున్నారా? ఆయన వ్యవహార శైలిపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉన్నదా? గడ్కరి రాజకీయాలు వదిలేస్తారా? ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే గడ్కరి గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లుగానే ఉన్నది. గత మూడేళ్లుగా గడ్కరి వ్యవహార శైలిని గమనిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ.. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉంటూ.. ఏకంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. పేరుకు బీజేపీ అయినా.. కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రధాని మోడీ వరకు ఆర్ఎస్ఎస్ గీసిన గీతను దాటడానికి వీలుండదనేది బహిరంగ రహస్యమే. ఈ విషయంలో గడ్కరి గీతను దాటేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే పార్టీలో ఆయన స్థాయిని తగ్గించడంతో పాటు.. క్రమంగా ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత తగ్గిస్తున్నట్లు తెలుస్తున్నది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గడ్కరి.. మొదటి నుంచి బీజేపీతో ఉన్నారు. యువ మోర్చ, ఏబీవీపీ నుంచి బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బీజేపీ మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా కూడా పని చేశారు. మహారాష్ట్ర మంత్రిగా కూడా సేవ చేశారు. క్రమంగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో అత్యున్నత పదవిని చేపట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు ఆయనే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొని రావడంలో గడ్కరి కీలక పాత్ర పోషించారు. ఇంత సేవ చేసిన గడ్కరి ఇప్పుడు పార్టీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. బీజేపీలో అత్యున్నత కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడం వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నదని తెలుస్తున్నది.
ఆర్ఎస్ఎస్ ముఖ్య కార్యాలయం ఉన్న నాగ్‌పూర్.. లోక్‌సభ ఎంపీగా గడ్కరినే ఉన్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్‌తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి,. అయితే బీజేపీ రెండో సారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత గడ్కరి వ్యవహార శైలిలో కాస్త మార్పు వచ్చింది. బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2019లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత గడ్కరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయ నాయకులు ప్రజలకు కలలను అమ్ముతారు.. కానీ వాటిని నెరవేర్చడంలో మాత్రం విఫలం అవుతారు. అందుకే ఓటములు తప్పవు' అని గడ్కరి వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు నేరుగా మోడీ, బీజేపీ ప్రభుత్వానికే తగలడంతో పార్టీలో పెద్ద చర్చ జరిగింది.
శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బోర్డు నుంచి తప్పించడంతో పార్టీ విధానపరమైన నిర్ణయం ఉన్నది. ముఖ్యమంత్రులకు పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించవద్దనే ఉద్దేశంతో ఆయనను తప్పించారు. కానీ గడ్కరి విషయంలో మాత్రం పూర్తిగా ఆర్ఎస్ఎస్ నిర్ణయమే అని తెలుస్తున్నది. 'రాజకీయాలు అంతా అధికారం చుట్టూనే తిరుగుతున్నాయి. అవి అంత మంచివి కావు' అంటూ గతంలో వ్యాఖ్యానించగా.. పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. అధికార పార్టీలో ఉంటూ.. అధికారం గురించి మాట్లాడటం ఏంటని పలువురు సీనియర్ నాయకులు కూడా గడ్కరి వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అయితే పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినా గడ్కరి ఏ మాత్రం తగ్గలేదు. తాను నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిని.. ప్రజలకు సేవ చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని అన్నారు.
బీజేపీలో ఇతర సీనియర్లు అందరూ పార్టీ, ఆర్ఎస్ఎస్ గీతను దాటి మాట్లాడరు. కానీ గడ్కరి పదే పదే ఇలా వ్యాఖ్యానించడం ఎప్పటికైనా ఇబ్బందే అని.. అందుకే పార్టీకి సంబంధించిన కీలక విషయాలు చర్చించే పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించినట్లు తెలుస్తున్నది. గడ్కరిపై ఆర్ఎస్ఎస్ చాలా కోపంగా ఉన్నదని ఓ బీజేపీ నాయకుడు కూడా వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత కూడా గడ్కరి వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. గత ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరి 'ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. అక్కడే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు' అని వ్యాఖ్యానించారు. ఇవి ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలను కించపరిచినట్లు ఉన్నాయని బీజేపీ నాయకులు అంటున్నారు. దేశం ఇప్పుడు గోల్డెన్ ఎరాలో కి ప్రవేశించిందని, అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గడ్కరి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్దంగా ఉండటంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. గడ్కరి కేంద్ర ప్రభుత్వాన్ని అనలేదని.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటున్నాయనే ధోరణిలో మాట్లాడారని సమర్థించుకున్నాయి. ఏదేమైనా గడ్కరి విషయం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాటను లెక్కచేయడం లేదని.. అవసరం అయితే రాజకీయాలు వదిలేస్తారనే వార్తలు వస్తున్నాయి.