Costly MBBS Course | ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే రూ.1.4 కోట్లు.. భారత్‌లోనే అత్యంత కాస్ట్‌లీ కాలేజీ..!
యూనివర్సిటీ ఫీజు, రీఫండబుల్ డిపాజిట్లు, క్యాషన్ మనీ తదితర పేర్లతో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థుల నుంచి ప్రైవేట్ డీమ్డ్ మెడికల్ కాలేజీలు లక్షల్లో వసూలు చేస్తుంటాయి.
Costly MBBS Course | వైద్యో నారాయణో హరి అన్నది నానుడి.. ఆపత్కాలంలో వైద్యం చేస్తే ప్రాణాలు దక్కుతాయి. అదే వైద్య విద్యనభ్యసించాలంటే మాత్రం రూ.లక్షల్లో.. కాదు కాదు రూ.కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తున్నది. నేవీ ముంబైలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవాలంటే అత్యంత కాస్ట్‌లీ మరి. ఈ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలంటే ఏటా రూ.30.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఓ ఆంగ్ల దిన ప్రతిక వార్తాకథనం ప్రచురించింది. దీని ప్రకారం నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి రూ.1.35 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిందే. ఇందులో హాస్టల్ చార్జీలు కలిపి ఉంటాయి. అయితే ఈ కళాశాలలో అడ్మిషన్ పొందుతున్నప్పుడు విద్యార్థి చెల్లించే వన్‌టైం యూనివర్సిటీ ఫీజు రూ.2.84 లక్షలు అదనం.
డీవై పాటిల్ కాలేజీకి అనుబంధంగా పూణేలో గల మెడికల్ కాలేజీ ఏటా రూ.29.5 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నది. ఇక భారతీయ విద్యాపీఠ్ మెడికల్ కాలేజీ (పూణే)లో చేరగోరే విద్యార్థులు రూ.26.84 లక్షల ఫీజు చెల్లించాలి. డీమ్డ్ మెడికల్ కాలేజీలు అత్యధిక ఫీజు వసూలు చేయడం డీవై పాటిల్ కాలేజీకి మాత్రమే పరిమితం కాలేదు. ఇతర డీమ్డ్ వైద్య విద్యా కళాశాలల్లో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులు రూ.25 లక్షల వరకూ పే చేయాల్సిందే.
మెజారిటీ డీమ్డ్ వైద్య విద్యా కళాశాలలు తమిళనాడులోనే ఉన్నాయి. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ కోర్సు చదివే విద్యార్థి నుంచి ఏటా రూ.28.13 లక్షలు వసూలు చేస్తున్నది. చెన్నైలోని మరో మెడికల్ కాలేజీ ఎస్ఆర్ఎం కాలేజీ రూ.27.2 లక్షల వార్షిక ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.
కొన్ని కాలేజీలు మరో అడుగు ముందుకేసి అడ్మిషన్ టైంలోనే వివిధ పద్దుల కింద అదనంగా ఫీజులు వసూలు చేస్తుంటాయి. యూనివర్సిటీ ఫీజు, రీఫండబుల్ డిపాజిట్లు, క్యాషన్ మనీ తదితర పేర్లతో ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థుల నుంచి ప్రైవేట్ డీమ్డ్ మెడికల్ కాలేజీలు లక్షల్లో వసూలు చేస్తుంటాయి. ఇదే కాలేజీలో చదివే విద్యార్థులు యాజమాన్యం నిర్వహించే హాస్టళ్లలోనే చేరాలనే షరతు కూడా విధిస్తుంటాయి. కొన్ని కాలేజీలు ఏటా ట్యూషన్ ఫీజు యథాతథంగా కొనసాగిస్తే, మరికొన్ని కాలేజీలు ఏయేటికాయేడు రెండు లేదా మూడు శాతం పెంచుతుంటాయి.
ప్రైవేట్, డీమ్డ్ కాలేజీలకు భిన్నంగా మహారాష్ట్రలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రతియేటా ఎంబీబీఎస్ కోర్సు అభ్యసించే విద్యార్థులు రూ.1.3 లక్షలు చెల్లించాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పేమెంట్ (మేనేజ్మెంట్ కోటా) సీట్లకు రూ.7 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ చెల్లించాలి. హాస్టల్, ఇతర చార్జీలు, డిపాజిట్లు అదనం.
మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ, ఇతర ఉత్తరాది ప్రాంతాల్లోని డీమ్డ్ యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కోర్సు ఫీజు చాలా చౌక. ఆయా కాలేజీలు తమ వెబ్‌సైట్ ద్వారా ఫీజు వివరాలు వెల్లడిస్తుంటాయి. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వార్షిక ట్యూషన్ ఫీజు రూ.50 వేల లోపే. ప్రైవేట్, డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లు.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే ఫీజు మాత్రమే వసూలు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ.. ఆ గెజిట్ నోటిఫికేషన్ అమలు కావడం లేదు.