Telugu Global
National

యాక్సిస్‌ బ్యాంకులో భారీ దోపిడీ.. – రూ.8.5 కోట్లు చోరీ

బ్యాంకు మేనేజర్‌ను లాకర్‌ గది తాళాలు అడగగా అతను నిరాకరించాడు. ఈ క్రమంలో దుండగులు అతన్ని పదునైన ఆయుధంతో కాలిపై దాడి చేసి గాయపర్చారు.

యాక్సిస్‌ బ్యాంకులో భారీ దోపిడీ.. – రూ.8.5 కోట్లు చోరీ
X

యాక్సిస్‌ బ్యాంకులో పట్టపగలు భారీ దోపిడీ జరిగింది. ఉదయం 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో రూ.7 కోట్ల నగదు, రూ.1.50 కోట్ల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకుపోయారు. ఈ సంఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయగఢ్‌ నగరంలో మంగళవారం ఉదయం ఈ దోపిడీ జ‌రిగింది. ఎస్పీ సదానందకుమార్‌ విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

రాయగఢ్‌ నగరం జగత్‌పూర్‌ ప్రాంతంలోని యాక్సిస్‌ బ్యాంకులోకి ఏడుగురు దుండగులు మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఆయుధాలతో ప్రవేశించారు. తొలుత బ్యాంకు ఉద్యోగులకు తుపాకులు చూపించి బెదిరిస్తూ వారిని ఒక గదిలో బంధించారు. బ్యాంకు మేనేజర్‌ను లాకర్‌ గది తాళాలు అడగగా అతను నిరాకరించాడు. ఈ క్రమంలో దుండగులు అతన్ని పదునైన ఆయుధంతో కాలిపై దాడి చేసి గాయపర్చారు. ఆ తర్వాత నగదు, బంగారు నగలు దోచుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తీవ్రంగా గాయపడిన బ్యాంకు మేనేజర్‌ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం దుండగుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు వెంటనే నగరంలోని రహదారులన్నీ దిగ్బంధనం చేశారు. చెక్‌పోస్టుల సిబ్బందిని అప్రమత్తం చేశారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీతో నగరమంతా కలకలం రేగింది.

*

First Published:  20 Sept 2023 2:51 AM GMT
Next Story