Telugu Global
National

నూతన పార్లమెంట్ భవనాన్ని 'శవ పేటిక'తో పోల్చిన ఆర్జేడీ

కొత్త పార్లమెంట్ భవనాన్ని, శవ పేటిక ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్టు చేసింది. ఆ పోస్టుకు 'యే క్యా హై' (ఇది ఏంటి) అనే క్యాప్షన్ జత చేసింది.

నూతన పార్లమెంట్ భవనాన్ని శవ పేటికతో పోల్చిన ఆర్జేడీ
X

నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంపై మొదటి నుంచి ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. పార్లమెంట్ భవనం ఓపెనింగ్‌కు కనీసం రాష్ట్రపతిని కూడా పిలవకుండా.. ఏకంగా ప్రధాని ప్రారంభించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీంతో పాటు సెంగోల్ మీద కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇన్ని నిరసనలు, వ్యతిరేకతల మధ్య ప్రధాని కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించారు. దీనిపై రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ సంచలన పోస్టు పెట్టింది.

కొత్త పార్లమెంట్ భవనాన్ని, శవ పేటిక ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్టు చేసింది. ఆ పోస్టుకు 'యే క్యా హై' (ఇది ఏంటి) అనే క్యాప్షన్ జత చేసింది. నూతన పార్లమెంట్ భవనం ఒక శవ పేటికలా ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని స్పూర్తితోనే ఆర్జేడీ ఈ రోజు ఇలాంటి పోస్టు పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల ప్రాణాలు తీసినందుకు గుర్తుగా.. పార్లమెంట్ భవనాన్ని ఇలా కట్టుకున్నారా అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం.. దేశానికి చట్టాలు చేసే పార్లమెంటు భవనాన్ని ఇలా శవపేటికతో పోలుస్తారా అని కౌంటర్ ఇస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ దీనికి మూల్యం చెల్లించుకుంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రాజదండం గురించి కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. రాజులు పోయి, రాజ్యాలు పోయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిన తర్వాత.. ఇలా రాజదండం పేరుతో లోక్‌సభలో ప్రతిష్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా.. బీజేపీ, మోడీ సపోర్టర్స్ మాత్రం ఇవ్వాళ సంబరాల్లో మునిగిపోయారు.


First Published:  28 May 2023 12:51 PM IST
Next Story