Telugu Global
National

బొట్టు పెట్టుకోలేదని జర్నలిస్టుతో మాట్లాడేందుకు నిరాకరించిన హిందుత్వ నాయకుడు

నుదుటిపై బొట్టు పెట్టుకోలేదనే కారణంతో శంభాజీ భిడే అనే హిందుత్వ నాయకుడు ఓ మహిళా జర్నలిస్టుతో మాట్లాడటానికి తిరస్కరించాడు. దాంతో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

బొట్టు పెట్టుకోలేదని జర్నలిస్టుతో మాట్లాడేందుకు నిరాకరించిన హిందుత్వ నాయకుడు
X

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ హిందుత్వ నాయకుడు 'శివ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్' అనే సంస్థ అధ్యక్షుడు శంభాజీ భిడే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. 2018 లో భీమా కోరేగావ్ లో అల్లర్లకు కారణమైన ఇతను 1980 దాకా ఆరెస్సెస్ లో ఫుల్ టైం కార్యకర్తగా పని చేశారు. ఇప్పుడీయన ఓ మహిళా జర్నలిస్టు బొట్టుపెట్టుకోలేదని మాట్లాడటానికి నిరాకరిచడం వివాదాస్పదమైంది.

శంభాజీ భిడే దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిసిన తర్వాత బైటికి వస్తున్నప్పుడు ఇరువురి సమావేశం వివరాల‌ గురించి ఓ టెలివిజన్ ఛానల్ కు చెందిన మహిళా రిపోర్టర్ బిడేను ప్రశ్నించారు. ఆమె నుదుటిపై బొట్టు పెట్టుకోలేదనే కారణంతో బిడే ఆమెతో మాట్లాడటానికి నిరాకరించాడు. మహిళ భారత మాతతో సమానమని, ఆమె బొట్టు పెట్టుకోకపోతే వితంతువు లా కనిపిస్తుందని బిడే ఆ జర్నలిస్టుతో అన్నాడు. నువ్వు బొట్టుపెట్టుకోలేదు కాబట్టి నేను నీతో మాట్లాడను ఆయన స్పష్టం చేశాడు.

హిందుత్వ నాయకుడు శంభాజీ భిడే జర్నలిస్టుతో అన్న మాటలు వివాదాస్పదం కావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ తన నోటీసులో పేర్కొన్నారు.

గతంలో కూడా అనేక సార్లు బిడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన తోటలోని మామిడి పండ్లను తిన్న దంపతులకు కుమారులు పుడతారని కొద్ది కాలం క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

First Published:  3 Nov 2022 1:39 PM IST
Next Story