Telugu Global
National

నమో అంటే నమ్మించి మోసం చేయడం.. రేవంత్ రెడ్డి సెటైర్లు

ఇటు హైదరాబాద్, అటు బెంగళూరు విశ్వనగరాలుగా, ఐటీ కేంద్రాలుగా ఆవిర్భవించడంలో కాంగ్రెస్ కష్టం, రాజీవ్ గాంధీ విజన్ ఉందని అన్నారు రేవంత్ రెడ్డి.

నమో అంటే నమ్మించి మోసం చేయడం.. రేవంత్ రెడ్డి సెటైర్లు
X

నరేంద్ర మోదీ(నమో) అంటే నమ్మించి మోసం చేయడం అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కర్నాటక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్నారు. ఇవి ఎన్నికలు కాదని రెండు పరివార్ ల మధ్య జరిగే యుద్ధం అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈవీఎం, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, అదానీ, అంబానీ.. అంతా మోదీ పరివార్ అని ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మా పరివార్ అని చెప్పారు రేవంత్.


ఈ ఎన్నికల్లో కర్నాటక నుంచి 20 మంది ఎంపీలను గెలిపించాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 14 సీట్లు గెలిపించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కృషి వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని, బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ ను మూడుసార్లు గెలిపిస్తే బెంగుళూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. బెంగళూరుకు కావాల్సిన నిధుల గురించి ఆయన ఏనాడూ పార్లమెంట్ లో ప్రస్తావించలేదన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం నుంచి నిధులు అడగడం లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. పల్లీ, బఠానీ తినడానికి పీసీ మోహన్.. పార్లమెంట్ సెంట్రల్ హాలుకు పోవాల్సిన అవసరం లేదని, అవి బెంగళూరు బస్టాండ్ లో కూడా దొరుకుతాయని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.

ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. పదేళ్లలో కేవలం 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుకు మోదీకి ఓటు వేయాలా? రైతులను మోసం చేసినందుకు వేయాలా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కుటుంబ రాజకీయాల గురించి బీజేపీ నేతలు మాట్లాడే ముందు యడ్యూరప్ప కుటుంబాన్ని పరిశీలించాలన్నారు. పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ, గోపీనాథ్ ముండే ఇద్దరు కూతుర్లు ఎంపీలుగా ఉన్నరని, రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రి.. ఆయన కొడుకు ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు చేసేవి కుటుంబ రాజకీయాలేనన్నారు. గుజరాత్ కు 7 కేబినెట్ పదవులు, యూపీకి 12 కేబినెట్ పదవులు ఇచ్చిన బీజేపీ.. 27మంది ఎంపీలను ఇచ్చిన కర్నాటకకు కేవలం ఒక్క కేబినెట్ పదవి మాత్రమే ఇచ్చిందన్నారు. కన్నడ ప్రజల్ని బీజేపీ అవమానించిందన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  21 April 2024 11:38 AM IST
Next Story