Telugu Global
National

24 గంటల్లో రాజీనామా చేయండి.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీకి కేంద్ర క్రీడాశాఖ అల్టిమేటం

24 గంటల్లో రాజీనామా చేయండి.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీకి కేంద్ర క్రీడాశాఖ అల్టిమేటం
X

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.

దేశానికి అనేక పత‌కాలు సాధించిన రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, రవి దహియా తదితర 30 మంది రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు, రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా మూడురోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. బ్రిజ్ భూషణ్, మరికొంతమంది కోచ్‌లతో కలిసి లక్నోలోని జాతీయ శిబిరాల్లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేష్ ఆరోపించారు. అనేక మంది రెజ్లర్లను కొట్టారని బజరంగ్ పునియా మండిపడ్డారు.

దేశానికి చెందిన ప్రముఖ రెజ్లర్ల ధర్నాతో భారత ప్రభుత్వం ఉలిక్కి పడింది. క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ హుటాహుటిన ఢిల్లీకి వచ్చి రెజ్లర్లతో సమావేశమై చర్చలు జరిపారు. ఆ తర్వాతే క్రీడా శాఖ నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా క్రీడా శాఖ నుండి ఈ ఉత్తర్వులు వెలువడక ముందు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు రుజువు చేస్తే ఉరేసుకుంటానని చెప్పారు.

First Published:  20 Jan 2023 6:22 AM GMT
Next Story