Telugu Global
National

వివాదాస్పదంగా మారిన అద్దెకు బాయ్ ఫ్రెండ్ స్టార్టప్

ఇదేమి బరితెగింపు? దేనికైనా అనుమతిస్తారా? 'బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్' పై విమర్శలు

వివాదాస్పదంగా మారిన అద్దెకు బాయ్ ఫ్రెండ్ స్టార్టప్
X

దేశంలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకీ పెరుగుతోంది. సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలిపే చర్యలు అధికమవుతున్నాయి. కొన్నేళ్ల కిందటి వరకు విదేశాలకే పరిమితమైన డేటింగ్ యాప్ లు మన దేశంలోకి కూడా ఎగబకాయి. చాలామంది ఫోన్లలో టిండర్ వంటి డేటింగ్ యాప్ లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకుపడి అద్దెకు బాయ్ ఫ్రెండ్ సంస్కృతి దేశంలో మొదలైంది. కొన్నేళ్ల కిందట ముంబయిలో ఇటువంటి స్టార్టప్ ఒకటి మొదటిసారి ప్రారంభం కాగా.. ఇటీవల కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో కౌశల్ ప్రకాష్ అనే వ్యక్తి ఈ స్టార్టప్ ను ప్రారంభించాడు.

ఇందుకోసం ఒక ఫోర్టల్ తో పాటు యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. టాయ్ బాయ్ పేరిట ఈ స్టార్టప్ బెంగళూరు నగరంలో నిర్వహిస్తున్నారు. అబ్బాయిలు కావాలనుకుంటున్న అమ్మాయిలు ఫోర్టల్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. అయితే అతడు భౌతికంగా అమ్మాయిల్ని కలవడు. ఫోన్లో మాట్లాడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రేమలో విఫలం అయిన వారు, మోసపోయిన వారు, డిప్రెషన్ కు లోనైనవారు ఒంటరితనానికి గురవకుండా తమ సాధకబాధకాలను చెప్పుకోవడానికి ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు స్టార్టప్ నిర్వాహకుడు కౌశల్ ప్రకాష్ తెలిపారు.

అలాగే అమ్మాయిల్లో మానసిక ఆందోళన, ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు అబ్బాయిలు సహకరిస్తారని ఆయన చెప్పారు. అమ్మాయిలు గంటకు కొంత మొత్తంలో చెల్లించి అబ్బాయిలను బుక్ చేసుకుని వారితో ఫోన్ లో మాట్లాడవచ్చు. కాగా ఈ స్టార్టప్ నిర్వహించడంపై కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సంస్కృతి, సాంప్రదాయాలను మంటగలిపే ఇలాంటి స్టార్టప్ నిర్వహణకు అనుమతి ఎలా ఇస్తున్నారంటూ.. సాంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. ఇలాంటి స్టార్టప్ ల వల్ల యువతలో విచ్చలవిడితనం పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దెకు అబ్బాయిలను ఇస్తుండడంపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.

First Published:  27 Sept 2022 1:02 PM IST
Next Story