నామినీ మరో పెళ్లి చేసుకున్నా.. బీమా పరిహారం చెల్లించాల్సిందే.. - స్పష్టం చేసిన హైకోర్టు
2010 మే నెలలో గణేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఠాణె-ముంబై రోడ్డుపై వీరిని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్ మృతిచెందాడు. ఆ తర్వాత కొద్దికాలానికి అతని భార్య మరో పెళ్లి చేసుకుంది.
నామినీ మరో పెళ్లి చేసుకున్నా బీమా పరిహారం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళ.. మరో పెళ్లి చేసుకుందనే నెపంలో ఆమెకు పరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీ నిరాకరించడం సరికాదని న్యాయస్థానం తీర్పు చెప్పింది.
2010 మే నెలలో గణేశ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఠాణె-ముంబై రోడ్డుపై వీరిని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్ మృతిచెందాడు. ఆ తర్వాత కొద్దికాలానికి అతని భార్య మరో పెళ్లి చేసుకుంది. దీనిని కారణంగా చూపిన ఇఫ్‌కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బాధిత మహిళకు పరిహారం చెల్లించేందుకు నిరాకరించింది. దీంతో పాటు ప్రమాదానికి కారణమైన ఆటో ఠాణె జిల్లాలో మాత్రమే తిరగడానికి అనుమతులు ఉండగా, జిల్లా సరిహద్దులు దాటిందని పేర్కొంటూ పరిహారం చెల్లించేందుకు సదరు కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ ఘటనలో బాధితురాలికి పరిహారం చెల్లించాల్సిందేనని మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని న్యాయమూర్తి జస్టిస్ ఎస్.జె.డింగె నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ ఈ ఏడాది మార్చి మూడో తేదీన తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఏం చెప్పారంటే..
`ఈ కేసులో బాధితురాలి వయసు భర్త చనిపోయే నాటికి 19 ఏళ్లు మాత్రమే. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఆమె అన్ని రకాలుగానూ అర్హురాలు. ఆమెకు బీమా పరిహారం వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండాలా..? ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తికి ఆమె భార్య అన్న విషయాన్ని మరిచిపోవద్దు. పరిహారం పొందేందుకు ఆమె అన్ని విధాలా అర్హురాలే. ఆటో సరిహద్దులు దాటితే బీమా చెల్లించరాదనే నిబంధనలను సమర్థిస్తూ కంపెనీ సరైన ఆధారాలు చూపించలేదు` అని చెబుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.