విమర్శల దాడి తో స్నేహితుని కోసం ఇచ్చిన ఆదేశాలు వెనక్కి తీసుకున్న మోదీ
అదానీ నుంచి తప్పని సరిగా బొగ్గు కొనాల్సిందే అంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దేశ వ్యాప్తంగా మోదీ సర్కార్ పై పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
దేశంలో బొగ్గు కొరత ఉన్నందువల్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుదుత్పత్తి కోసం విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ ఇచ్చిన ఆదేశాలను కేంద్రం వెనక్కి తీసుకుంది. దేశ వ్యాప్తంగా మోదీ సర్కార్ పై పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలతో కేంద్రం వెనక్కి తగ్గింది.
విదేశీ బొగ్గును 10 శాతం దిగుమతి చేసుకోవాల్సిందే అని, ఒక వేళ అలా దిగుమతి చేసుకోకపోతే జరిమానాలు తప్పవంటూ కేంద్ర విద్యుత్తు మంత్రిత్రశాఖ రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా చేసింది.
కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాల వెనక మోదీ స్నేహితుడైన అదానీ ప్రయోజనాలు దాగున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా,ఇండోనేషియాల్లో అదానీకి భారీ ఎత్తున బొగ్గు బ్లాకులు ఉండటమే ఈ ఆదేశాల వెనక ఉన్న అసలు రహస్యమని విమపక్షాలు విమర్షలు గుప్పించాయి. అదానీకి లాభాల కోసం దేశాన్ని ఫణంగా పెడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోబోమని కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది. రోజుకు 50వేల టన్నుల బొగ్గును రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో వినియోగిస్తుండగా అందులో విదేశాల నుంచి 10 శాతం(5 వేల టన్నులు) కచ్చితంగా దిగుమతి చేసుకోవాలని కేంద్రం గత నెలలో ఆదేశించింది. ఈ ఆదేశాలను కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు.
కేసీఆర్ కు అనేక మంది విపక్ష ముఖ్యమంత్రులు గొంతు కలిపారు. విపక్ష నేతలు కూడా మోదీ పై విమర్షలు గుప్పించారు. కొంత కాలంగా సాగుతున్న ఈ వివాదం ఎట్టకేలకు సమిసిపోయింది. అన్ని వైపుల నుండి జరుగుతున్న దాడిని తట్టుకోలేని మోదీ సర్కార్ తన ఆదేశాలను వెనక్కు తీసుకుంది. దీంతో అదానీ నుండి బొగ్గును అధిక ధరలకు కొనాల్సిన తప్పనిపరిస్థితుల నుండి రాష్ట్రాలు బైటపడ్డాయి.