Telugu Global
National

లింగ‌వివ‌క్ష లేని ప‌దాల వినియోగంపై సుప్రీంకోర్టు హ్యాండ్‌బుక్ విడుద‌ల‌

మగవాళ్లు అధికులు, ఆడవాళ్లు అల్పులనే సాధారణీకరణ భావజాలం నుంచి న్యాయ‌మూర్తులు, న్యాయవాదులు కూడా బయటపడాల్సిన అవసరాన్ని ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్‌ నొక్కి చెప్పారు.

లింగ‌వివ‌క్ష లేని ప‌దాల వినియోగంపై సుప్రీంకోర్టు హ్యాండ్‌బుక్ విడుద‌ల‌
X

ఇక‌పై న్యాయ‌స్థానాల్లో విచార‌ణ‌లు, వాద‌న‌ల సంద‌ర్భంగా స్త్రీల‌ను కించ‌ప‌రిచే, చుల‌క‌న భావ‌న‌తో చూసే ప‌దాలు వినియోగించొద్దని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇందుకోసం లింగ వివ‌క్ష‌కు తావులేని ప‌దాల‌ను వినియోగించ‌డంపై ఒక హ్యాండ్‌బుక్‌ను కూడా రూపొందించింది. బుధ‌వారం దీనిని విడుద‌ల చేసిన చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌.. న్యాయ సంవాదాలు, ఉత్త‌ర్వులు, లిఖిత‌పూర్వ‌క వాద‌న‌ల స‌మ‌యంలో న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదుల‌కు ఈ పుస్త‌కం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

మహిళలను మూసధోరణిలో కించపరిచే, చులకన భావనతో చూసే పదాల స్థానంలో వినియోగించాల్సిన ప్రత్యామ్నాయాలతో ఈ పుస్త‌కాన్ని సుప్రీంకోర్టు రూపొందించింది. పురుషులతో సమానంగా మహిళలనూ గౌరవించాల్సి ఉందని స్పష్టం చేసింది. న్యాయ నిఘంటువుల నుంచి వివక్షపూరిత పదాలను తొలగించడం కూడా ఈ పుస్తకం లక్ష్యాల్లో ఒకటిగా పేర్కొంది. ముఖ్యంగా లైంగిక హింసకు గురైన బాధితులను న్యాయపరిభాషలో వివరించే సమయంలో మూసధోరణిని వీడేందుకు 30 పేజీల ఈ పుస్తకం తోడ్పడుతుందని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు. ఆహారపు అలవాట్లు, వేషధారణ, వ్యక్తిగత ఆసక్తులు, అభిప్రాయాల ఆధారంగా మహిళల పట్ల దురభిప్రాయాలను ఏర్పరచుకోవడం కానీ, ఆ కారణంతో వారిపై దురుసుగా ప్రవర్తించడం కానీ సమర్ధనీయం కాదని స్పష్టంచేశారు.

మగవాళ్లు అధికులు, ఆడవాళ్లు అల్పులనే సాధారణీకరణ భావజాలం నుంచి న్యాయ‌మూర్తులు, న్యాయవాదులు కూడా బయటపడాల్సిన అవసరాన్ని ఈ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్‌ నొక్కి చెప్పారు. న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పుల్లో మహిళలను ప్రస్తావిస్తూ చేసిన అనేక అనుచిత పదాలను ఈ పుస్త‌కంలో పేర్కొన్న‌ట్టు వివ‌రించారు. కోర్టు తీర్పుల్లో, ఉత్తర్వుల్లో మహిళలపై వివక్ష చూపే విధంగా వాడే పదాలు సరైనవి కావని, అయితే, ఆ తీర్పులను విమర్శించడం ఈ పుస్తకం ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. 'హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్`.. పేరుతో రూపొందించిన ఈ బుక్‌లెట్ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని చీఫ్ జ‌స్టిస్ ఈ సంద‌ర్భంగా వెల్లడించారు.

హ్యాండ్ బుక్‌లో సుప్రీంకోర్టు సూచించిన పదాలివీ..

- వేశ్య, వ్యభిచారిణి అనే అర్థంలో ఆంగ్లంలో వినియోగిస్తున్న ప్రాస్టిట్యూట్, వోర్, హుకర్ వంటి పదాలను సుప్రీంకోర్టు నిషేధించింది. దానికి బదులుగా సెక్స్ వ‌ర్కర్ అనే పదాన్ని సూచించింది.

- ఉంపుడుగత్తె అనే అర్థంలో వాడే ఆంగ్ల పదాలు.. కీప్, కాంక్యుబైన్ అనడానికి బదులుగా వివాహేతర లైంగిక సంబంధాలున్న మహిళ (ఉమన్ విత్ సెక్సువల్ రిలేషన్స్ అవుట్‌సైడ్ ఆఫ్ మ్యారేజి)గా పేర్కొనాలి.

- ఉంపుడుగత్తె సంతానమని చెప్పేందుకు బాస్టర్డ్ అని కాకుండా అవివాహ దంపతుల సంతానం (నాన్ మారిటల్ చైల్డ్) అని తెలపాలి.

- హౌస్ వైఫ్ ప‌దం స్థానంలో హోమ్ మేక‌ర్ అని, మిస్ట్రెస్ ప‌దం స్థానంలో ఉమ‌న్ అని సంబోధించాలి.

- కెరీర్ ఉమన్‌ను.. ఉమన్ (మహిళ) అని పిలిస్తే సరిపోతుంది.

- ఈవ్‌టీజింగ్‌ని ఇక‌పై `స్ట్రీట్ సెక్సువ‌ల్ హెరాస్మెంట్‌`గా పేర్కొనాలి.

- భారతీయ/ విదేశీ మహిళ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మహిళ అని అంటే సరిపోతుంది.

- అన్‌వెడ్ మదర్ (అవివాహ‌ తల్లి) స్థానంలో మదర్ (అమ్మ) అనాలి.

- స్పిన్‌స్ట‌ర్ (క‌న్య‌) అని పేర్కొన‌డం క‌న్నా అవివాహిత మహిళ (అన్ మ్యారీడ్ ఉమన్) అనడం సముచితం. ఇలా ప‌లు ప‌దాల‌కు ప్ర‌త్యామ్నాయాల‌ను సుప్రీంకోర్టు విడుద‌ల చేసిన హ్యాండ్ బుక్‌లో వివ‌రించింది. ఇక‌పై న్యాయ‌స్థానాలు వాద‌న‌లు, విచార‌ణ‌ల‌, తీర్పుల సంద‌ర్భంగా ఈ ప‌దాల‌ను వినియోగించాల్సి ఉంటుంది.

First Published:  17 Aug 2023 9:14 AM IST
Next Story