Telugu Global
National

కేంద్రం సూచ‌న‌లతోనే బిల్కిస్ బానో కేసులో దోషుల‌ విడుదల : గుజ‌రాత్ ప్ర‌భుత్వం

గుజరాత్ లో బిల్కిస్ బానో కేసులో రేపిస్టులను కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే విడుదల చేశామని గుజరాత్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నిందితులు ఘోర‌మైన నేరానికి పాల్ప‌డ్డార‌ని ద‌ర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పినా, వారి విడుద‌ల‌ను ప్ర‌త్యేక న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తి వ్య‌తిరేకించినా నిందితులను విడుద‌లచేశారు.

కేంద్రం సూచ‌న‌లతోనే బిల్కిస్ బానో కేసులో దోషుల‌ విడుదల : గుజ‌రాత్ ప్ర‌భుత్వం
X

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో నిందితుల‌ ముంద‌స్తు విడుద‌ల కేంద్ర హోం శాఖ సూచ‌న‌ల మేర‌కే జ‌రిగింద‌ని స్ప‌ష్ట‌మైంది. కేంద్రం సూచ‌న‌ల మేర‌కే నిందితుల‌ను ముందుగా విడుద‌ల చేశామ‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం నేడు సుప్రీం కోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ తెలిపింది. ఈ కేసులో నిందితులు ఘోర‌మైన నేరానికి పాల్ప‌డ్డార‌ని ద‌ర్యాప్తు సంస్థ సిబిఐ చెప్పినా, వారి విడుద‌ల‌ను ప్ర‌త్యేక న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తి వ్య‌తిరేకించినా నిందితులను విడుద‌లచేశారు.


బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులకు మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ కేసులో దోషులుగా ఉన్న వారిని ముందుగా విడుదల చేసేందుకు కేంద్ర హోం శాఖ జూలై 11న రాసిన లేఖ ద్వారా ఆమోదం తెలిపింద‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం పేర్కొంది. 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత వారి ప్రవర్తన బాగానే ఉండ‌డంతో ప్రభుత్వం దోషులను నిర్దోషులుగా విడుదల చేసిందనిపేర్కొంది.

ఈ కేసులో దోషుల ముంద‌స్తు విడుద‌ల‌ను స‌వాల్ చేస్తూ సీపీఎం నేత సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతి లాల్, విద్యావేత్త రూప్ రేఖా వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీంతో పాటు టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఈ అంశంపై పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రుపుతోంది.


''రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఆగస్టు 10న ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. న్యాయస్థానం 1992 విధానం కింద చేసిన ప్రతిపాదనలను రాష్ట్రం పరిగణనలోకి తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా ఖైదీలకు రెమిష‌న్ ఇవ్వ‌లేదు. ''అని కోర్టుకు తెలిపింది.


'పిల్‌ ' (ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం) ముసుగులో మూడవ పక్షం క్రిమినల్ వ్యవహారంలో జోక్యం చేసుకోజాలదని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. రెమిష‌న్ ను(ఉపశమనాన్ని) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు పిల్ అధికార పరిధిని పూర్తిగా దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం కూడా ఆమోదించిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. 11 మంది రేపిస్టుల విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూలై 11న లేఖ ద్వారా ఆమోదం తెలిపింద‌ని పేర్కొంది.

గోద్రా అల్ల‌ర్ల‌ తర్వాత 2022 మార్చి 3వ తేదీన గుజరాత్ లో బిల్కిస్‌ బానో అనే ముస్లిం మహిళపై ఓ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఆమె బంధువుల‌ను హ‌త‌మార్చింది. ఈ కేసులో నిందితుల‌ను ఇటీవ‌ల ముద‌స్తుగా విడుద‌ల చేసింది గుజ‌రాత్ ప్ర‌భుత్వం. దీనిపై పౌర స‌మాజం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.




First Published:  18 Oct 2022 7:49 AM GMT
Next Story