మణిపూర్ మంటలు - మిజోరం హాహాకారాలు
12వేల మందికి పైగా ప్రజలు తమ రాష్ట్రంలోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని మిజోరం ప్రకటించింది. నిర్వాసితులైన వారికి సౌకర్యాలు కల్పించేందుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది.
మెయితీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా మారింది. దాదాపు రెండు నెలలుగా మణిపూర్ అట్టుడికిపోతోంది. వేలాది విధ్వంస ఘటనల్లో వందలాది మంది చనిపోయారు. 4వేలకుపైగా ఇళ్లు, దాదాపు 300 గ్రామాలు ధ్వంసం అయ్యాయి. స్వయంగా కేంద్ర హోం మంత్రి మణిపూర్‌లో నాలుగురోజులు మకాంవేసినా పరిస్థితిని చక్కబెట్టలేకపోయారు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పాఠశాలలు మూసివేశారు. మణిపూర్ హింస ఇప్పుడు మిజోరం రాష్ట్రానికి తలనొప్పిగా మారింది. తమ రాష్ట్రంలోకి వస్తున్న శరణార్థులను ఎలా ఆదుకోవాలో తెలియక గగ్గోలు పెడుతోంది.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కాగా.. ఉద్దేశపూర్వకరంగా మణిపూర్‌లో కొందరు హింసను ప్రోత్సహిస్తున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. మయన్మార్ నుంచి దేశంలోకి అక్రమంగా ఆయుధాలు రవాణా అవుతున్నాయని ఆరోపిస్తున్నాయి. తాజాగా ఇంపాల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ కమాండో బృందం, హెయిన్‌గాంగ్ పోలీసు, 16వ జాట్ రెజిమెంట్‌లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. వేర్పాటువాద గ్రూపులకు చెందిన వారు మయన్మార్‌లో ఆయుధాలను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మయన్మార్ - చైనా సరిహద్దుల్లోని ఆయుధాల బ్లాక్ మార్కెట్ నుంచి వాటిని కొనుగోలు చేసి అక్రమంగా మణిపూర్‌లోకి తరలిస్తున్నట్లు తెలిపారు.
మణిపూర్‌లో హింస మొదలైన నాటి నుంచి దాదాపు 37,000 మంది సహాయ శిబిరాలకు వెళ్లారు. వేలాది మంది రాష్ట్ర సరిహద్దులు దాటి పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు. 12వేల మందికి పైగా ప్రజలు తమ రాష్ట్రంలోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని మిజోరం ప్రకటించింది. నిర్వాసితులైన వారికి సౌకర్యాలు కల్పించేందుకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర సరిహద్దులు దాటిన వారిలో ఎక్కువ మంది సహాయక శిబిరాల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని మిజోరం ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం ఈ విషయంలో స్పందించకపోతే రెండు వారాలకు మించి మణిపూర్ నిరాశ్రయులను ఆదుకోలేమంటోంది. ఇప్పటికే వనరుల కొరత ఏర్పడిందని ప్రకటించింది. ఉన్నదాంట్లో నెట్టుకొస్తున్నామన్న మిజోరం.. ఇంకా కినుక వహించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఇంఫాల్, చురచందుపూర్‌లోని పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శిస్తారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలనూ పరిశీలిస్తారు. మణిపూర్ అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులకు సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని బీజేపీ మైనార్టీ మోర్చా ఆరోపించింది. బీరేన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది.