బీజేపీ విధానాలవల్ల మళ్ళీ దేశ విభజన ప్రమాదం: ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్చరిక
మైనార్టీలను రెండవ తరగతి పౌరులుగా దిగజార్చడం దేశ విభజనకు దారితీస్తుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. నిరంకుశవాదం కాక ఉదారవాద ప్రజాస్వామ్యమే ఈ దేశాన్ని అన్నివిధాల రక్షిస్తుందని ఆయన అన్నారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మండిపడ్డారు. మైనార్టీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశంలో చీలికను సృష్టిస్తాయని, అది దేశ విభజనకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) 5వ జాతీయ సదస్సులో రాజన్ మాట్లాడారు.
మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు మెజారిటీవాదాన్ని, నిరంకుశవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. "మెజార్టీ వాదం ఈ అభివృద్ధి యుగంలో దేశాన్ని బలహీనపరుస్తుంది, విదేశీ జోక్యానికి అవకాశం కల్పిస్తుంది.'' అని రాజన్ అన్నారు.
"ఒక దేశం ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైనప్పుడు, మైనారిటీలపై దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అది ఎక్కడికి దారి తీస్తుందో శ్రీలంక మంచి ఉదహరణ'' అని రాజన్ అభిప్రాయపడ్డారు.
దేశ అభివృద్ధికి అవసరమైన ఉదార ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అవసరమన్న ఆయన ఆర్థిక వృద్ధిని సాధించడంలో ఉదార ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించారు." ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలోనే మన భవిష్యత్తు ఉంది. దానిని బలహీనపరిస్తే భవిష్యత్తు నాశనమే" అని ఆయన అన్నారు.
"ఉదారవాదం మతానికి వ్యతిరేకం కాదన్నారు రాజన్. అందరిలో మంచిని వెతకడమే ప్రతి మతం యొక్క సారాంశం . ఉదారవాద ప్రజాస్వామ్యం యొక్క సారాంశం కూడా ఇదే. అని రఘురామ్ రాజన్ చెప్పారు.
భారతదేశం అభివృద్ధికి నిరంకుశ నాయకత్వం అవసరమనే ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నట్లు రాజన్ చెప్పారు.