మహారాష్ట్రలో కొత్త ట్విస్ట్.. షిండేకు షాక్ ! ..బీజేపీలోకి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు !?
మహారాష్ట్రలో శివసేన ను చీల్చి బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఏక్ నాథ్ షిండేకు షాక్ తగలనుందా ? ఆయన వర్గంలోని సగం మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్టు శివసేన అధికార పత్రిక సామ్నా సంచలన కథనం ప్రచురించింది.
మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నట్టు కనబడుతోంది. బిజెపితో అంటకాగి శివసేన పార్టీని చీల్చి మహావికాస్ అఘాడి (ఎంవిఎ) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్ నాథ్ షిండేకు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలే షాక్ ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని 'ఉద్ధవ్ శివసేన బాలాఠాక్రే' గ్రూపు అధికార పత్రిక ' సామ్నా' సంచలన కథనం ప్రచురించింది. సామ్నా కథనం ఇలా సాగింది.
"ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలోని 40 మంది ఎమ్మెల్యేలలో 22 మంది తీవ్ర అసంతృప్టిగా ఉన్నారు. వీరు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ఎమ్మెల్యేలే అజమాయిషీ చలాయిస్తున్నారని ఓ బిజెపి నాయకుడు కూడా చెబుతున్నారు" అని' సామ్నా' పేర్కొంది.
" షిండేను ముఖ్యమంత్రిని చేయడం కేవలం తాత్కాలిక ఏర్పాటే. నిర్ణయాలన్నీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటే వాటిని ఏక్ నాథ్ షిండే ప్రకటిస్తారు. ఏక్ నాథ్ షిండేను ఇలాగే బిజెపి ఉపయోగించుకుంటుంది. ఏదో ఒక రోజు షిండే ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగక తప్పదు." అని సామ్నా తెలిపింది.
"అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికలో షిండే వర్గం అభ్యర్ధి పోటీ చేయకుండా బిజెపి తన అభ్యర్ధిని ప్రకటించి ఆ తర్వాత ఉపసంహరించుకుంది. దీన్ని బట్టి రానున్న రోజులలో షిండే పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది. ఆయన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు బిజెపిలో విలీనం అవుతారు." అని సామ్నా పేర్కొంది.