Telugu Global
National

గుజరాత్ లోనూ బీజేపీకి రెబల్స్ బెడద..

ఇటీవల గుజరాత్ లో టికెట్లు ఖరారు చేసిన బీజేపీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించింది. మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా లిస్ట్ లో లేవు. దీంతో వారంతా పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.

గుజరాత్ లోనూ బీజేపీకి రెబల్స్ బెడద..
X

ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించి రెబల్స్ బెడద ఎదుర్కొంది బీజేపీ. ఇప్పుడు గుజరాత్ లో కూడా కమలం పార్టీకి ఆ బాధ తప్పేలా లేదు. ఇక్కడ ఐదుగురు రెబల్స్ గా మారబోతున్నారు. ఇటీవల టికెట్లు ఖరారు చేసిన బీజేపీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరించింది. అదే సమయంలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా లిస్ట్ లో లేవు. దీంతో వారంతా పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. రెబల్స్ గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.

హర్షద్ వాసవ అనే మాజీ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు నాందోడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆల్రడీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ నుంచి డాక్టర్ దర్శన దేశ్ ముఖ్ బరిలో దిగారు. హర్షద్ వాసవ బీజేపీ రెబల్ గా నామినేషన్ వేశారు. గుజరాత్ లో అసలు బీజేపీ, డూప్లికేట్ బీజేపీ రెండూ ఉన్నాయని, నిబద్ధతతో కూడిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు హర్షద్ వాసవ. వడోదర జిల్లాలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవ్ కి ఈసారి టికెట్ నిరాకరించింది బీజేపీ. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా వాఘోడియా నియోజకవర్గం నుంచి బరిలో దిగబోతున్నారు.

ఇక వడోదర జిల్లాలోని పద్రా స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే దినేష్ పటేల్, కర్జన్‌ లో మాజీ ఎమ్మెల్యే సతీష్ పటేల్, జునాగఢ్‌ లోని కేషోడ్ స్థానానికి మాజీ ఎమ్మెల్యే అరవింద్ లడానీ స్వతంత్రులుగా బరిలో దిగారని నిర్ణయించారు. ఇప్పటికే చాలా సార్లు అధిష్టానం వీరిని బుజ్జగించినా ఫలితం లేదు. ఈ ఐదుగురు స్థానికంగా బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేస్తారనే పేరుంది. బీజేపీ ఇప్పటి వరకు మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 166 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

First Published:  13 Nov 2022 5:31 PM IST
Next Story