Telugu Global
National

అమరావతి వర్సెస్ అయోధ్య.. నాయకుల రియల్ కుంభకోణం..

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం, అయోధ్యని జిల్లాగా మార్చడం వంటి ప్రయోజనాలతో అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతుందని ఊహించిన బీజేపీ నాయకులు.. ముందుగా అక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారు.

అమరావతి వర్సెస్ అయోధ్య.. నాయకుల రియల్ కుంభకోణం..
X

ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే.. ఆ చుట్టుపక్కల టీడీపీ నేతలు స్థలాలు కొని పెట్టుకున్నారు. వారి సన్నిహితులు కూడా అక్కడే పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత తీరిగ్గా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి, ఆ ప్రతిఫలం అనుభవించాలని చూశారు. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి ఘటనే అయోధ్యలో జరిగింది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం, అయోధ్యని జిల్లాగా మార్చడం వంటి ప్రయోజనాలతో అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతుందని ఊహించిన బీజేపీ నాయకులు.. ముందుగా అక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించారు. అక్రమ లే అవుట్లు వేసి మధ్యతరగతి ప్రజలకు అంటగట్టారు. తీరా ఇప్పుడు ఆ కుంభకోణం బయటపడటంతో నాలుక కరుచుకున్నారు. ఈ రియల్ స్కామ్ లో బీజేపీ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా, అయోధ్య మేయర్‌ రిషికేష్ ఉపాధ్యాయ్‌, బీజేపీ మాజీ ఎమ్మెల్యే గోరఖ్‌ నాథ్‌ బాబా సహా కమలదళానికి చెందిన దాదాపు 40 మంది నేతలు ఉన్నారు. అయోధ్య డెవలప్‌ మెంట్‌ అథారిటీ (ఏడీఏ) అక్రమార్కుల లిస్ట్ బయటపెట్టింది.

ఇలా బయటపడింది..

అయోధ్య మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత డ్రైవ్‌ ను ఇటీవల ఏడీఏ చేపట్టింది. ఏడీఏ భూముల్లో అక్రమ కాలనీలు ఉన్నట్టు గ్రహించిన అధికారులు వాటిని కూల్చడానికి బుల్డోజర్లు తీసుకెళ్లారు. అయితే, తాము డబ్బులు చెల్లించి ఇక్కడ స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేశామని స్థానికులు దబాయించారు. తమ పేరిట ఉన్న పన్ను రశీదులు, ఇంటిపత్రాలు చూపించారు. దీంతో ఈ భూదందా పక్కా ఆధారాలతో బయటపడింది.

దేవుడి పేరుతో అక్రమార్జన..

అయోధ్య రామమందిరాన్ని ఇన్నాళ్లూ బీజేపీ కేవలం ఓటుబ్యాంకుగానే చూసిందని అనుకునేవారంతా, కానీ అంతకు మించి అన్నట్టుగా స్థానిక బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని తమ జేబులు నింపేందుకు వాడుకున్నారు. రియల్ బూమ్ ని క్యాష్ చేసుకున్నారు. అక్రమ లేఅవుట్లు వేసి, ఇళ్లు కట్టించి, వాటిని ప్రజలకు అంటగట్టి, ఇప్పుడు చేతులెత్తేశారు. దాదాపు 30 కాలనీల్లో వేలాది ఇళ్లు నిర్మించి ప్రజలను మోసం చేశారు. అవినీతి బీజేపీ అయోధ్యను కూడా వదల్లేదంటూ సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అంశంలో లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

First Published:  8 Aug 2022 9:17 AM IST
Next Story